Drunk Driving: ఢిల్లీలో డ్రంకెన్ డ్రైవ్.. 15 మందిపై నుంచి దూసుకుపోయిన కారు డ్రైవర్.. వీడియో ఇదిగో!

Drunk car driver rams 15 people in Delhi Budh market one dead
  • ఈస్ట్ ఢిల్లీలోని ఘాజీపూర్‌లో గతరాత్రి 9.30 గంటల సమయంలో ఘటన
  • యువతి మృతి.. మరికొందరికి గాయాలు
  • పోలీసులను ఘెరావ్ చేసిన స్థానికులు
ఢిల్లీలో మద్యం మత్తులో ఓ కారు డ్రైవర్ 15 మందిపై నుంచి దూసుకుపోయాడు. ఈ ఘటనలో ఓ యువతి ప్రాణాలు కోల్పోగా మిగతావారు తీవ్రంగా గాయపడ్డారు. ఈస్ట్ ఢిల్లీలోని ఘాజీపూర్‌లో గతరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడిని పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. చనిపోయిన మహిళను యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన 22 ఏళ్ల సీతాదేవిగా గుర్తించారు. గాయపడిన వారిని లాల్‌బహదూర్‌శాస్త్రి ఆసుపత్రికి తరలించారు.   

ట్యాక్సీ డ్రైవర్ మయూర్ విహార్ ఫేజ్ 3కి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పూర్తిగా మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ రాత్రి 9.30 గంటల సమయంలో రద్దీగా ఉన్న బుద్ధ్ బజార్ ప్రాంతంలో జనాన్ని తొక్కించుకుంటూ పోయాడు. కారు ఒక్కసారిగా అదుపుతప్పి జనంపైకి దూసుకెళ్లడం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు డ్రైవర్‌ను పట్టుకుని చితకబాదారు. కారును ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, వారిని రాకుండా స్థానికులు ఘెరావ్ చేసి రోడ్డును దిగ్బంధించారు. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పి వారిని చెదరగొట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Drunk Driving
East Delhi
Crime News
Budh Bazar

More Telugu News