RRR Movie: రిలీజై ఏడాదిన్నర దాటినా.. జపాన్‌లో ఏమాత్రం క్రేజ్ తగ్గని 'ఆర్ఆర్ఆర్'
- 2022 అక్టోబర్ 21న జపాన్‌లో విడుదలయిన మూవీ
- 44 నగరాల్లో 209 థియేటర్లు, 31 ఐమాక్స్ తెరలపై ప్రదర్శన
- 34 రోజుల్లోనే 300 మిలియన్ జపాన్ యెన్‌ల క్లబ్‌లోకి 'ఆర్ఆర్ఆర్'
- ఇప్పటికీ అక్కడి సినిమా థియేటర్ల ముందు హౌస్‌ఫుల్ బోర్డులు
- మార్చి 18న సినిమాను వీక్షించేందుకు జపాన్ వెళ్తున్న రాజమౌళి
ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' మూవీ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ యన్‌టీఆర్ హీరోలుగా 2022 మార్చి 24న వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులు సృష్టించింది. ఏకంగా ఆస్కార్ వరకు వెళ్లింది. అక్కడ మూవీలోని 'నాటునాటు' పాటకు ఆస్కార్ అవార్డు కూడా దక్కింది. అయితే, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్‌ను చిత్రయూనిట్ అభిమానులతో పంచుకుంది.
2022 అక్టోబర్ 21న ఈ మూవీ జపాన్‌లో గ్రాండ్‌గా విడుదలయింది. 44 నగరాల్లో 209 థియేటర్లు, 31 ఐమాక్స్ తెరలపై దీనిని ప్రదర్శించారు. 34 రోజుల్లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టి 300 మిలియన్ జపాన్ యెన్‌ల క్లబ్‌లో చేరింది. భారత కరెన్సీలో దాదాపు రూ.18 కోట్లు. దీంతో ఈ క్లబ్‌లో అత్యంత వేగంగా చేరిన తొలి భారతీయ చిత్రంగా రికార్డుకెక్కింది. ఇక జపాన్‌లో ఈ చిత్రం రిలీజై ఏడాదిన్నర దాటినా అక్కడ ఈ మూవీ క్రేజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ అక్కడి సినిమా థియేటర్ల ముందు హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
ఈ విషయాన్ని తెలుపుతూ 'ఆర్ఆర్ఆర్' తన అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. మార్చి 18న సినిమాను వీక్షించేందుకు డైరెక్టర్ రాజమౌళి జపాన్ వెళుతున్నారు. ఈ విషయం తెలియడంతో అక్కడి ప్రేక్షకులు ఆయనతో కలిసి మూవీని చూసేందుకు ఆసక్తిగా ఉన్నారట. దీంతో వేలాది మంది టికెట్లు కొనుగోలు చేసేందుకు యత్నించారు. ఫలితంగా బుధవారం రాత్రి టికెట్స్ బుకింగ్ ఓపెన్ చేయగా.. ఒక్క నిమిషంలోనే హౌస్‌ఫుల్ అయింది. దీనిపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్ క్రేజ్ ఇది', 'రాజమౌళి మన తెలుగు సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లారు' అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.