USA: భారత పౌరసత్వ సవరణ చట్టంపై అమెరికా ఆందోళన
- చట్టం ముందు అందరూ సమానులేనన్నది ప్రజాస్వామ్య మౌలిక సూత్రమన్న అమెరికా
- చట్టం అమలును నిశితంగా పరిశీలిస్తున్నామని వెల్లడి
- అన్ని మతాలకు గౌరవం ఉండాలని వ్యాఖ్య
- మీడియా సమావేశంలో అమెరికా విదేశాంగ ప్రతినిధి
భారత ప్రభుత్వం తాజాగా అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామన్న అమెరికా, ఈ చట్టం ఆందోళనకారకమేనని వ్యాఖ్యానించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ప్రభుత్వం నోటిఫై చేసిన పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనగా ఉన్నాం. ఈ చట్టాన్ని ఎలా అమలు చేస్తారనేది నిశితంగా పరిశీలిస్తున్నాం. అన్ని మతాలకు గౌరవం, చట్టప్రకారం అన్ని వర్గాల వారికీ ఒకే హక్కులు ఉండటం ప్రజాస్వామ్య ప్రధాన సిద్ధాంతం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే నూతన పౌరసత్వ చట్టాన్ని అమెరికాలోని పలు హిందూ సంస్థలు స్వాగతించాయి.
2019లో పార్లమెంటు ఆమోదించిన పౌరసత్వ చట్టాన్ని కేంద్రం సోమవారం నుంచి అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం, 2014 డిసెంబర్ 31కి ముందు పాక్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారత్‌కు వలసొచ్చిన ముస్లిమేతరులకు భారత్ పౌరసత్వం లభిస్తుంది. ఆయా దేశాలకు చెందిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లకు ఈ చట్టం కింద పౌరసత్వం లభిస్తుంది.
అయితే, ఈ చట్టం వివక్షాపూరితమైనదంటూ ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వివరణ ఇచ్చింది. సీఏఏ వల్ల భారతీయ ముస్లింలకు వచ్చిన ఇబ్బందేమీ లేదని పేర్కొంది. వారు తమ పౌరసత్వాన్ని కోల్పోరని భరోసా ఇచ్చింది. హిందూమతస్తులతో సమానమైన హక్కులు ఉంటాయని స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది.