BRS-BSP: బీఆర్ఎస్-బీఎస్పీ మధ్య సీట్ల పంపకం పూర్తి.. నాగర్ కర్నూలు నుంచి బరిలోకి ప్రవీణ్‌కుమార్!
- హైదరాబాద్, నాగర్ కర్నూలు సీట్లను బీఎస్పీకి కేటాయించిన బీఆర్ఎస్
- మిగతా స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ
- ఇప్పటికే 11 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో బీఆర్ఎస్, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) మధ్య పొత్తు కుదిరింది. పొత్తుపై కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తుండగా ఇరుపార్టీల మధ్య పొత్తు ఖరారైనట్టు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. పొత్తు, సీట్ల పంపకానికి సంబంధించి ఇటీవల బీఎస్పీ జాతీయ ప్రతినిధులు హైదరాబాద్‌లో కేసీఆర్‌తో చర్చలు కూడా జరిపారు.
తాజాగా, ఈ రోజు ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకం పూర్తయింది. పొత్తులో భాగంగా హైదరాబాద్, నాగర్ కర్నూలు నుంచి బీఎస్పీ అభ్యర్థులు పోటీచేస్తారు. ఈ రెండు స్థానాల్లో బరిలో నిలిచే అభ్యర్థులకు బీఆర్ఎస్ నేతలు పూర్తి సహకారం అందిస్తారు. మిగతా స్థానాల్లో బీఆర్ఎస్ బరిలోకి దిగుతుంది. కాగా, బీఆర్ఎస్ ఇప్పటికే 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. నాగర్ కర్నూలు నుంచి బీఎస్పీ తెలంగాణ చీఫ్ ప్రవీణ్ కుమార్ బరిలోకి దిగుతారని సమాచారం.