Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ కీలక ప్రకటన.. లుంగి ఎంగిడి స్థానంలో జేక్ ఫ్రేజర్
- గాయం కారణంగా తప్పుకున్న స్టార్ పేసర్
- రూ.50 లక్షల కనీస ధరకు జేక్ ఫ్రేజర్‌ను తీసుకున్న డీసీ
- ఇటీవలే ఢిల్లీ నుంచి హ్యారీ బ్రూక్ కూడా ఔట్
- రిషబ్ పంత్ తిరిగి జట్టులో చేరడంతో ఢిల్లీ యాజమాన్యం ఖుషీ
మరో వారం రోజుల్లో ఐపీఎల్-2024 ప్రారంభం కానుండగా ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) తాజాగా కీలక ప్రకటన చేసింది. లుంగి ఎంగిడి స్థానంలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్‌ను తీసుకున్నట్లు ప్రకటించింది. గాయం కారణంగా ఎంగిడి ఐపీఎల్ 17వ సీజన్ నుంచి తప్పుకోవడంతో ఢిల్లీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 14 ఐపీఎల్ మ్యాచులు ఆడిన ఎంగిడి 25 వికెట్లు పడగొట్టాడు. ఎంగిడి లాంటి స్టార్ పేసర్ తప్పుకోవడం ఢిల్లీకి పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఇక అతని స్థానంలో రూ.50లక్షల కనీస ధర చెల్లించి జేక్ ఫ్రేజర్‌ను డీసీ తీసుకుంది.
ఇటీవలే ఢిల్లీ నుంచి హ్యారీ బ్రూక్ కూడా తప్పుకున్నాడు. రూ.4కోట్లు చెల్లించి కొనుగోలు చేసిన బ్రూక్ చివరి నిమిషంలో వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్-2024 నుంచి తప్పుకోవడం జరిగింది. అతని స్థానంలోనే జేక్ ఫ్రేజర్‌ను తీసుకుంటున్నట్లు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. కానీ, చివరికి ఎంగిడి స్థానంలో ఈ ఆస్ట్రేలియన్ యువ ఆటగాడిని డీసీ ఎంచుకుంది. ప్రస్తుతం హ్యారీ బ్రూక్ స్థానంలో ఢిల్లీ ఇంకా ఎవరినీ తీసుకోలేదు.
మరోవైపు రిషబ్ పంత్ తిరిగి జ్టటులోకి చేరడంతో ఢిల్లీ యాజమాన్యం హ్యాపీగా ఉంది. 15 నెలల తర్వాత రిషబ్ తిరిగి ఐపీఎల్-2024లోనే బ్యాట్ పట్టనున్నాడు. 2022 డిసెంబర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఈ యువ ఆటగాడు చాలా త్వరగానే కోలుకున్నాడు. అతని కమ్‌బ్యాక్ ఢిల్లీకి కలిసొచ్చే అంశం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఐపీఎల్‌లో ఇప్పటివరకు డీసీ ప్రదర్శన అంత గొప్పగా ఏమీ లేదు. 2020లో ఫైనల్ చేరడం, 2019, 2021లో ప్లేఆఫ్స్ వరకు వెళ్లింది. ఇప్పుడు రిషబ్ పంత్ తిరిగి రావడంతో పాటు జేక్ ఫ్రేజర్ లాంటి యువ ఆలౌండర్ జట్టులో చేరడంతో ఢిల్లీ ఈసారి మంచి ఆటతో ఆకట్టుకోవాలని చూస్తోంది. ఇక మార్చి 23న పంజాబ్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో ఈ 17వ సీజన్‌లో ఢిల్లీ జర్నీ మొదలుకానుంది.