YS Sharmila: బంధువులే హత్య చేశారు.. జగన్ అన్న ఇంతగా దిగజారుతాడని అనుకోలేదు: వివేకా స్మారక సభలో షర్మిల తీవ్ర వ్యాఖ్యలు

Relatives killed YS Vivekananda Reddy says Sharmila
  • వివేకా వర్ధంతి సందర్భంగా కడపలో సంస్మరణ సభ
  • బాబాయ్ ను చంపిన వారికి ఇంత వరకు శిక్ష పడలేదని ఆవేదన
  • తోబుట్టువుల కోసం జగన్ ఏం చేశారని ప్రశ్న
చిన్నాన్న వైఎస్ వివేకాను అత్యంత కిరాతకంగా హత్య చేసి ఐదేళ్లు గడుస్తోందని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. బాబాయ్ శరీరంపై ఎన్నో గొడ్డలి పోట్లు ఉన్నాయని, దారుణంగా హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య జరిగి ఐదేళ్లు పూర్తవుతున్నా ఇంత వరకు హంతకులకు శిక్ష పడలేదని అన్నారు. చిన్నాన్న మరణంతో చిన్నమ్మ, సునీత అందరి కంటే ఎక్కువ నష్టపోయారని చెప్పారు. వివేకానందరెడ్డి వర్ధంతి సందర్భంగా కడపలో స్మారక సభ జరుగుతోంది. ఈ సభకు ఏపీసీసీ చీఫ్ షర్మిల, వివేకా కూతురు సునీత, టీడీపీ నేత బీటెక్ రవి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి, కాంగ్రెస్ నేత తులసిరెడ్డితో పాటు పలువురు నేతలు, ఆత్మీయులు హాజరయ్యారు.

 ఈ సందర్భంగా షర్మిల భావోద్వేగంతో మాట్లాడారు. న్యాయం కోసం పోరాడుతున్న సునీతను టార్గెట్ చేసి ఎంతో వేధించారని షర్మిల మండిపడ్డారు. బాధితులకు భరోసా ఇవ్వాలన్న ఆలోచన లేకపోగా వారిపైనే ఆరోపణలు చేస్తారా? అని ప్రశ్నించారు. అన్నా అని పిలిపించుకున్న వారే హంతకులను రక్షిస్తున్నారని విమర్శించారు. బంధువులే హత్య చేశారని అన్ని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయని తెలిపారు. హత్య చేసిన వారికి, చేయించిన వారికి ఇంత వరకు శిక్షపడలేదని చెప్పారు. హత్యకు గురైన చివరి క్షణం వరకు బాబాయ్ వైసీపీ కోసమే పని చేశారని అన్నారు. జగనన్న ఇంతగా దిగజారుతాడని అనుకోలేదని చెప్పారు. సాక్షిలో పైన వైఎస్ ఫొటో ఉంటుందని... కింద వైఎస్ తమ్ముడి వ్యక్తిత్వ హననం ఉంటుందని మండిపడ్డారు. 

అద్దం ముందు నిలబడి మీ మనస్సాక్షి ఏం చెపుతోందో వినాలని షర్మిల అన్నారు. తన తోబుట్టువుల కోసం వైఎస్ ఏం చేశాడో మీకు తెలియదా? అని ప్రశ్నించారు. వైఎస్ వారసుడిగా తోబుట్టువుల కోసం మీరు ఏం చేశారని జగన్ ను నిలదీశారు. ఐదేళ్లయినా చిన్నాన్న ఆత్మకు శాంతి కలగలేదని చెప్పారు. 

సునీత, తాను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగామని, కలిసి చదువుకున్నామని షర్మిల తెలిపారు. న్యాయం కోసం పోరాడుతున్న సునీతకు తాను అండగా ఉంటానని చెప్పారు. రాజకీయాల కోసమో, అధికారం కోసమో తాను ఈ వ్యాఖ్యలు చేయడం లేదని... వివేకా హంతకులకు శిక్ష పడాలని అన్నారు.
YS Sharmila
Congress
YS Viveka Murder Case
YS Sunitha Reddy
Jagan
YSRCP
AP Politics

More Telugu News