Dasoju Sravan: బీజేపీ నాయకుడిని ఏ ఒక్కరినైనా అరెస్టు చేశారా?: దాసోజు శ్రవణ్
- చౌహాన్ పై వ్యాపమ్ కేసు ఏమైంది? యడియూరప్ప జైలుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్న
- కేసులు ఉంటే తమ పార్టీలో చేరండని బీజేపీ నేతలు ఆహ్వానిస్తున్నారని ఎద్దేవా
- బీజేపీలో చేరితే శుద్ధపూసలు అయిపోతారంటూ మండిపడ్డ బీఆర్ఎస్ నేత
- ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై తీవ్రంగా మండిపడ్డ శ్రవణ్
‘‘దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా, ఏ ఒక్క బీజేపీ నేత ఇంటిపై అయినా ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు జరిగాయా.. కేసులు ఉన్న బీజేపీ నేతల్లో ఏ ఒక్కరినైనా అరెస్టు చేశారా..’’ అంటూ బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రస్తుతం దేశంలోని అన్ని పార్టీల్లో అవినీతిపరులు ఉన్నారని అంగీకరిస్తానన్న శ్రవణ్.. బీజేపీలో మాత్రమే అవినీతిపరులు లేరంటూ ఎద్దేవా చేశారు. అవినీతి, అక్రమాలకు సంబంధించి ఎలాంటి కేసులు ఎదుర్కొంటున్న నేతలైనా సరే బీజేపీలో చేరితే శుద్ధపూసలు అయిపోతారని, వారిపై ఏ విచారణ సంస్థలు దాడులు చేయవని ఆరోపించారు. ఈమేరకు శనివారం ఉదయం ఓ మీడియా సంస్థ చర్చలో దాసోజు శ్రవణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. కవిత అరెస్టు అక్రమమని, రాజకీయ కక్ష సాధింపు చర్యేనని విమర్శించారు. ప్రతిపక్ష నాయకులపై చిన్న ఆరోపణలు వచ్చినా వెంటనే దాడులు చేస్తున్న కేంద్ర విచారణ సంస్థలకు బీజేపీ నేతలు ఎదుర్కొంటున్న పెద్ద పెద్ద కేసులు గుర్తుండవని విమర్శించారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పై వ్యాపమ్ కేసు ఉన్నా ఆయనపై కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అవినీతి ఆరోపణలు, కేసులు ఎదుర్కొంటున్న హిమంత బిశ్వ శర్మను అసోం ముఖ్యమంత్రిని ఎలా చేశారని బీజేపీ నేతలను ప్రశ్నించారు. కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప జైలులో ఎందుకులేడని నిలదీశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనా కేసులు ఉన్నాయని, బీజేపీకి ధైర్యముంటే ఆయనపై చర్యలు తీసుకుని చూపించాలని సవాల్ విసిరారు. బీజేపీలో చేరితే కేసులు ఉండవు, సీబీఐ ఈడీ ఐటీ దాడులు ఉండవు.. బీజేపీ నుంచి బయటకు వచ్చినా, బీజేపీకి వ్యతిరేకంగా నిలుచున్నా విచారణ సంస్థల దాడులు జరుగుతాయని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. మొన్నటి వరకు బీజేపీలో ఉండి, ఎన్నికల ముందు కాంగ్రెస్ లోకి వెళ్లిన వివేక్ వెంకటస్వామి విషయంలో ఈ విషయం మరోసారి నిరూపణ అయిందని చెప్పారు. బీజేపీలో ఉన్నంతకాలం వివేక్ పై ఎలాంటి దాడులు జరగలేదని, కాంగ్రెస్ లోకి వెళ్లిన వెంటనే వివేక్ ఇంటిపై ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారని శ్రవణ్ గుర్తుచేశారు.