Delhi Liquor Scam: అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చి.. నళినీ చిదంబరానికి ఇచ్చిన రిలీఫ్‌నే కవితకు ఇవ్వండి: న్యాయవాది విక్రమ్ చౌదరి
- రౌస్ అవెన్యూ కోర్టులో కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు
- సుప్రీంకోర్టులో కేసు విచారణ దశలో ఉందని.. ఇంతలోనే కవితను ఈడీ అరెస్ట్ చేసినట్లు వివరణ
- గతంలో సీఆర్‌పీసీ 160 సెక్షన్ కింద ఆమెను సీబీఐ 8 గంటల పాటు విచారించిన విషయాన్ని గుర్తు చేసిన న్యాయవాది
- ఈ నెల 19న సుప్రీంకోర్టులో మరోసారి విచారణ ఉన్నట్లు వెల్లడి
కవితకు ఈడీ గతేడాది సమస్లు జారీ చేసినప్పుడే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని రౌస్ అవెన్యూ కోర్టులో కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. "కేసు సుప్రీంకోర్టులో ఉన్నందున సమన్లు ఇవ్వబోమంటూ ఈడీ తరపు అదనపు సొలిసిటర్ జనలర్ సుప్రీంకోర్టు బెంచ్‌కు హామీ ఇచ్చారు. ఆ తర్వాత కూడా మరోసారి వాదనలు జరిగాయి. ఈడీ న్యాయవాదులే కేసు విచారణపై వాయిదాలు తీసుకున్నారు. సెప్టెంబర్ 15న సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్ చెప్పిన విషయాన్ని దేశమంతా చూసింది. ఆ మాటలను ఈడీ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించింది. ఈడీ ఇచ్చిన సమన్లను, నమోదు చేసిన కేసును నిలిపివేయాలని, మొత్తం కేసునే క్వాష్ చేయాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో కోరాం.
ఒకవైపు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ వుంది. నిన్న కూడా కేసు మరోసారి విచారణకు వచ్చింది. నిన్న మధ్యాహ్నం సుప్రీంకోర్టులో వాదనలు పూర్తియి, కేసు వాయిదా పడింది. ఆ తర్వాత కొద్దిసేపటికే తెలంగాణలో కవిత నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. సాయంత్రానికి అదుపులోకి తీసుకుంటున్నట్లు ఈడీ అధికారులు ప్రకటించారు. గతంలో సీఆర్‌పీసీ 160 సెక్షన్ కింద సీబీఐ 8 గంటల పాటు ఆమెను విచారించింది. ఈ నెల 19న సుప్రీంకోర్టులో మరోసారి విచారణ ఉంది. అప్పటి వరకు ఈ కేసు విచారణ ఇక్కడ నిలిపివేయాలి. అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వండి. నళినీ చిదంబరానికి ఇచ్చిన రిలీఫ్‌నే కవితకు కూడా ఇవ్వాలి" అని విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు.