Narendra Modi: ఇన్నాళ్లు బీఆర్ఎస్ అవినీతికి పాల్పడితే ఇప్పుడు కాంగ్రెస్ వంతు వచ్చింది: ప్రధాని మోదీ విమర్శలు
- తెలంగాణ ప్రజల కోసం కోటి బ్యాంకు ఖాతాలు తెరిచామన్న మోదీ
- బీజేపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, రైతులకు ఎక్కువ ప్రయోజనం జరిగిందని వెల్లడి
- కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమన్న మోదీ
యాదగిరిగుట్టలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కకు చిన్నపీట వేసి కాంగ్రెస్ పార్టీ అవమానించిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. నాగర్‌కర్నూలులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రజల కోసం తాము కోటి బ్యాంకు ఖాతాలు తెరిచామన్నారు. కోటిన్నర మందికి బీమా ఇచ్చామని, 67 లక్షల మందికి ముద్రా రుణాలు అందించామన్నారు. 80 లక్షల మంది ఆయుష్మాన్ పథకం కింద లబ్ధి పొందారన్నారు. బీజేపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, రైతులకు ఎక్కువ ప్రయోజనం జరిగిందన్నారు.
కాంగ్రెస్ సామాజిక న్యాయం పేరుతో రాజకీయంగా పబ్బం గడుపుకుంటోందన్నారు. గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడించేందుకు ప్రయత్నించారని విమర్శించారు. కేసీఆర్ దళితబంధు పేరిట మోసం చేశారన్నారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని మోసం చేశారని, కొత్త రాజ్యాంగం రాస్తామంటూ అంబేడ్కర్‌ను అవమానించారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తెలంగాణ ప్రజలు కూడా బీజేపీనే కోరుకుంటున్నారని తెలిపారు.
తెలంగాణ ప్రజల కలలను బీఆర్ఎస్, కాంగ్రెస్ చిదిమేశాయన్నారు. ఇన్నాళ్లు బీఆర్ఎస్ అవినీతికి పాల్పడితే ఇప్పుడు కాంగ్రెస్ వంతు వచ్చిందన్నారు. తెలంగాణను మరింత నాశనం చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి ఈ అయిదేళ్లు చాలని విమర్శించారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామన్నారు. పగలు, రాత్రి మీ కోసం పని చేస్తానన్నారు. నిన్న మల్కాజిగిరిలో తనకు ప్రజల నుంచి మంచి మద్దతు లభించిందన్నారు. గరీబీ హఠావో అని కాంగ్రెస్ దశాబ్దాలుగా చెప్పినా ఇంతవరకు పేదరికం పోయిందా? అని నిలదీశారు. దేశంలో బీజేపీకి మెజారిటీ వచ్చాకే మార్పు మొదలైందని... మార్పుకు మోదీది గ్యారెంటీ అన్నారు.