K Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త, పీఆర్వో రాజేశ్, మరో ముగ్గురికి ఈడీ నోటీసులు
- సోమవారం తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్న ఈడీ
- కవిత ఇంట్లో సోదాల సమయంలో వీరి ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్న ఈడీ
- నిన్న మొత్తం పది ఫోన్లు సీజ్ చేసిన ఈడీ అధికారులు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్, పీఆర్వో రాజేశ్, మరో ముగ్గురు అసిస్టెంట్లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చింది. సోమవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈడీ సూచించింది. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టుకూ ఈడీ వెల్లడించింది. నిన్న కవిత ఇంట్లో సోదాలు చేసిన సమయంలో కవిత ఫోన్లతో పాటు భర్త అనిల్ ఫోన్, పీఆర్వో రాజేశ్‌కు చెందిన రెండు ఫోన్లు, మరో ముగ్గురు అసిస్టెంట్లకు చెందిన ఫోన్లను ఈడీ సీజ్ చేసింది. మొత్తం పది ఫోన్లను స్వాధీనం చేసుకుంది. వీటిని తీసుకోవడానికి ఢిల్లీకి రావాలని వారికి తెలిపింది.
ఢిల్లీ మద్యం కేసులో కవితను ఈడీ నిన్న అరెస్ట్ చేసింది. ఈ రోజు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. కోర్టు ఆమెకు వారం రోజుల ఈడీ కస్టడీ విధించింది. ఈ నెల 23వ తేదీ వరకు ఆమెను ఈడీ అధికారులు విచారించనున్నారు. అంతలోనే ఇప్పుడు కవిత భర్తకు, మరో నలుగురికి ఈడీ నోటీసులు ఇవ్వడం గమనార్హం.