addanki dayakar: కవిత అరెస్ట్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా వెనుక బీజేపీ: అద్దంకి దయాకర్

Addanki Dayakar hot comments on bjp
  • ఇదంతా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల డ్రామా అని విమర్శ
  • నోటిఫికేషన్ కంటే ముందే అరెస్ట్ పేరుతో రాజకీయ డ్రామాను తెరపైకి తెచ్చాయని మండిపాటు
  • దక్షిణాదిన తన బలం పెంచుకోవడానికి బీజేపీ ఎత్తుగడ అని వ్యాఖ్య
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్... బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా... ఈ రెండింటి వెనుక బీజేపీ ఉందని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఆరోపించారు. శనివారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... ఇదంతా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల డ్రామా అని విమర్శించారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని... అందుకే తమ పార్టీని దెబ్బకొట్టడానికి ఆ రెండు పార్టీలు ఈ డ్రామాతో ప్రయత్నం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.

ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే అరెస్ట్ పేరుతో రాజకీయ డ్రామాను తెరపైకి తెచ్చారన్నారు. ఢిల్లీ మద్యం కేసును ఓ వెబ్ సిరీస్‌లా నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి డ్రామాలను తెలంగాణ ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. దక్షిణాదిన తన బలం పెంచుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని.. ఇందులో భాగంగా ఈ ఎత్తుగడ వేసిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు బీజేపీ సహకరిస్తే... పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సహకరిస్తోందన్నారు.
addanki dayakar
BJP
BRS
Lok Sabha Polls

More Telugu News