PV Sindhu: జీవితంలో ఏదో ఒక దశలో మార్గదర్శకత్వం అవసరం: పీవీ సింధు
- ఇటీవల ఆటలో విఫలమవుతున్న పీవీ సింధు
- గాయాలతో సతమతమవుతున్న వైనం
- ప్రకాశ్ పదుకొనే తన మెంటార్ అని ప్రకటించిన సింధు
భారత బ్యాడ్మింటన్ ధ్రువతార పీవీ సింధు ఆసక్తికర అంశం వెల్లడించింది. ఒలింపిక్స్ లక్ష్యంగా శ్రమిస్తున్న తనకు ఇక నుంచి ప్రకాశ్ పదుకొనే మెంటార్ గా వ్యవహరిస్తారని ప్రకటించింది. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక దశలో మార్గదర్శకత్వం అవసరం అవుతుందని అభిప్రాయపడింది.
"కొన్నిసార్లు మనం స్తబ్దుగా ఉండిపోతాం. అలాంటి సమయంలో ఓడలకు దారి చూపే లైట్ హౌస్ లా, మనల్ని మళ్లీ గాడిన పెట్టేందుకు ఓ తలపండిన అనుభవశాలి కావాలి. నా విషయానికొస్తే ఆ మార్గదర్శి ఎవరో కాదు... ప్రకాశ్ పదుకొనే. నన్ను గెలుపు దిశగా నడిపించే వ్యక్తి మాత్రమే కాదు, నా జీవితంలో కూడా మార్గదర్శనం చేసే వ్యక్తిని కనుగొన్నందుకు సంతోషంగా ఉంది.
నాకు శిక్షణ ఇవ్వడానికి, నాతో క్రీడా ప్రస్థానం సాగించడానికి మిమ్మల్ని ఒప్పించడం పట్ల ధన్యురాలిని అయ్యాను... మీ అమూల్యమైన, అచంలచమైన, స్ఫూర్తిదాయకమైన, అత్యంత ప్రభావవంతమైన మార్గదర్శకత్వంలో భారత బ్యాడ్మింటన్ నిజంగా లబ్ధి పొందుతుంది సర్" అంటూ పీవీ సింధు బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొనేను ఉద్దేశించి ట్వీట్ చేసింది.
ప్రకాశ్ పదుకొనే భారత బ్యాడ్మింటన్ రంగంలో దిగ్గజంగా పేరొందారు. ఆయన మాజీ వరల్డ్ నెంబర్ వన్ క్రీడాకారుడు. బాలీవుడ్ భామ దీపికా పదుకొనే ఈయన కుమార్తే.
కాగా, పీవీ సింధు ఇటీవల కాలంలో విఫలమవుతోంది. గతేడాది కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం గెలిచాక సింధు ఆటతీరు దిగజారింది. గాయాలతో సతమతమవుతున్న ఈ హైదరాబాదీ స్టార్ షట్లర్... మళ్లీ ట్రాక్ లోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.
2023లో 15 బీడబ్ల్యూఎఫ్ టోర్నీల్లో ఆడిన సింధు ఒక్కదాంట్లోనూ టైటిల్ నెగ్గలేకపోయింది. దాంతో తన కోచ్ గా పార్క్ టే సంగ్ స్థానంలో హఫీజ్ హషీమ్ ను నియమించుకుంది. ఇప్పుడు మెంటార్ గా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొనే పేరు ప్రకటించింది.
త్వరలో పారిస్ ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో, ప్రకాశ్ సలహాలు తనకెంతగానో ఉపకరిస్తాయని సింధు భావిస్తోంది.