Dr Ranjith Reddy: బీఆర్ఎస్‌కు మరోషాక్.. పార్టీని వీడిన చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి
- పార్టీని వరుసగా వీడుతున్న నేతలు
- కాంగ్రెస్‌లో చేరనున్న రంజిత్‌రెడ్డి
- తన రాజీనామాను ఆమోదించాలని కేసీఆర్‌ను కోరిన చేవెళ్ల ఎంపీ
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్‌కు తలపోట్లు తప్పడం లేదు. ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒకరి తర్వాత ఒకరిగా కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు. తాజాగా చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్‌రెడ్డి బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్‌లో చేరబోతున్నారు.
ఈ సందర్భంగా రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే పార్టీకి రాజీనామా చేసినట్టు తెలిపారు. చేవెళ్ల ప్రజలకు ఇంతకాలం సేవ చేసే అవకాశం కల్పించినందుకు పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరిన ఆయన బీఆర్ఎస్‌లో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు.
మరోవైపు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఇంకోవైపు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాలను ఆయన ఖండించినప్పటికీ ప్రచారం మాత్రం ఆగడం లేదు.