Prajagalam Sabha: ప్రజాగళం సభా ప్రాంగణానికి చేరుకున్న చంద్రబాబు, బాలకృష్ణ, లోకేశ్, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి
- కాసేపట్లో ప్రారంభం కానున్న ప్రజాగళం సభ
- మూడు పార్టీల కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిసిన సభా ప్రాంగణం
- మోదీ ఏం చెపుతారా అనే దానిపై సర్వత్ర ఆసక్తి
టీడీపీ, జనసేన, బీజేపీల ప్రజాగళం సభ కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. సభా వేదికపై ప్రస్తుతం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మూడు పార్టీల అభిమానులు, కార్యకర్తలతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. కాసేపటి క్రితం సభా ప్రాంగణానికి టీడీపీ నేతలు బాలకృష్ణ, నారా లోకేశ్, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేరుకున్నారు.
మరోవైపు, చిలకలూరిపేట నుంచి బొప్పూడి సభావేదిక వరకు ట్రాఫిక్ జామ్ అయింది. నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మంగళగిరి టోల్ గేట్ వద్ద వేల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. వాహనాల రద్దీ పెరగడంతో టోల్ గేట్ నిర్వాహకులు కాసేపు గేట్లను ఎత్తేశారు.
ఇంకోవైపు, సభలో ప్రధాని మోదీ 40 నిమిషాల పాటు ప్రసంగిస్తారని తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ చెరో 15 నిమిషాల పాటు ప్రసంగించనున్నారు. ఇప్పుడు అందరి దృష్టి మోదీ ప్రసంగంపైనే ఉంది. ఆయన ఏం చెపుతారో అని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.