Rasmalai: మన రసమలై స్వీట్ కు ప్రపంచంలోనే రెండో ర్యాంకు
- టాప్-10 డిజర్ట్స్ జాబితా విడుదల చేసిన టేస్ట్ అట్లాస్ సంస్థ
- రసమలై వంటకానికి విశిష్ట గుర్తింపు
- పోలెండ్ కు చెందిన సెర్నిక్ స్వీట్ కు ప్రథమస్థానం
అంతర్జాతీయ ఫుడ్ గైడ్ సంస్థ టేస్ట్ అట్లాస్ ప్రపంచంలోనే అత్యుత్తమ స్వీట్స్ జాబితా విడుదల చేసింది. ఇందులో భారతీయ స్వీట్ రసమలై రెండో స్థానం దక్కించుకుంది. భోజనం సందర్భంగా ఆరగించే స్వీట్లతో ఈ జాబితా రూపొందించింది.
రసమలై ఓ బెంగాలీ వంటకం. బెంగాల్ లో ఏ మూలకు వెళ్లినా రసమలై స్వీట్ నోరూరిస్తూ స్వాగతం పలుకుతుంది. దీని తయారీలో ప్రధానంగా పాలు ఉపయోగిస్తారు. చక్కెర, కుంకుమపువ్వు, నిమ్మరసం రసమలై తయారీలో ఉపయోగిస్తారు.
ఈ లిస్టులో పోలెండ్ స్వీట్ సెర్నిక్ నెంబర్ వన్ గా నిలిచింది. సెర్నిక్ వంటకాన్ని కోడిగుడ్లు, చక్కెరతో తయారు చేస్తారు. సెర్నిక్ కూడా ఒక రకమైన చీజ్ వంటి డిజర్ట్ అని చెప్పాలి.
టేస్ట్ అట్లాస్ రూపొందించిన టాప్-10 డిజర్ట్స్ లిస్టులో సెర్నిక్, రసమలై తర్వాత వరుసగా స్ఫకియానోపిటా (గ్రీస్), న్యూయార్క్ చీజ్ (అమెరికా), జపనీస్ చీజ్ (జపాన్), బాస్క్ చీజ్ (స్పెయిన్), రాకోజీ టురోస్ (హంగేరీ), మెలోపిటా (గ్రీస్), కసెకుచెన్ (జర్మనీ), మిసారెజీ (చెక్ రిపబ్లిక్) స్వీట్లు నిలిచాయి.