Virat Kohli: స్మృతి మంధానకు విరాట్ కోహ్లీ వీడియో కాల్
- డబ్ల్యూపీఎల్ తొలి టైటిల్ గెలిచిన జట్టుకి అభినందనలు తెలిపిన కింగ్
- ‘సూపర్ వుమెన్స్' అంటూ ఇన్‌స్టాలోనూ ప్రశంసించిన కోహ్లీ
- డబ్ల్యూపీఎల్ ట్రోఫీని తొలిసారి గెలిచిన ఆర్సీబీ ఉమెన్స్ జట్టు
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టైటిల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారి గెలవడంతో ఆ జట్టు ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఆర్సీబీ పురుషుల జట్టు ఐపీఎల్ ట్రోఫీని ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. కానీ ఆర్సీబీ ఉమెన్స్ టీమ్ డబ్ల్యూపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకోవడంతో పురుషుల జట్టు కూడా మురిసిపోతోంది. ఆర్సీబీ మాజీ కెప్టెన్, టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. ఆర్సీబీ ఉమెన్స్ టీమ్ కెప్టెన్ స్మృతి మంధానకు వీడియో కాల్ చేసి అభినందనలు తెలిపాడు. ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కూడా కోహ్లీ స్పందించాడు. ట్రోఫీని సాధించిన ఆర్సీబీ ఉమెన్స్ జట్టు ‘సూపర్ వుమెన్స్' అని ప్రశంసించాడు.
కాగా ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్, ఆర్సీబీ ఉమెన్స్ జట్లు తలపడ్డాయి. ఢిల్లీపై ముంబై 8 వికెట్ల తేడాతో విజయం సాధించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మరో మూడు బంతులు మిగిలివుండగానే ఆర్సీబీ లక్ష్యాన్ని ఛేదించింది. స్మృతి మంధాన (31), సోఫి (32), ఎల్లీస్ పెర్రీ (35 నాటౌట్) ఆర్సీబీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. కాగా ఐపీఎల్ 2008లో ఆరంభమవ్వగా ఆర్సీబీ పురుషుల జట్టు ఇప్పటికి ఒక్కసారి కూడా టైటిల్‌ను గెలుచుకోలేకపోయింది. ఆ జట్టు టైటిల్‌ను గెలవడం ఇంకా ఒక కలగానే ఉందన్న విషయం తెలిసిందే.