Meg Lanning: డ‌బ్ల్యూపీఎల్ ఫైన‌ల్‌లో ప‌రాజ‌యం.. క‌న్నీళ్లు పెట్టుకున్న ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్‌.. వీడియో వైర‌ల్‌!

Viral Video of Meg Lanning Spotted in Tears After Delhi Capitals lose to Royal Challengers Bangalore in WPL 2024 Final
  • డ‌బ్ల్యూపీఎల్ ఫైన‌ల్‌లో బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ విజ‌యం
  • వ‌రుస‌గా రెండోసారి టైటిల్ చేజార‌డంతో క‌న్నీళ్లు పెట్టుకున్న‌ డీసీ కెప్టెన్ మెగ్ లానింగ్
  • గ‌తేడాది ఫైన‌ల్‌లో ముంబై ఇండియ‌న్స్ చేతిలో ఢిల్లీ ప‌రాజ‌యం  
  • ఆస్ట్రేలియా కెప్టెన్‌గా ఐదు ప్ర‌పంచ క‌ప్‌లు గెలిచిన లానింగ్
  • రెండుసార్లు డ‌బ్ల్యూపీఎల్ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచిన వైనం
డ‌బ్ల్యూపీఎల్ ఫైన‌ల్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ (డీసీ) పై బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ విజ‌యం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది. రెండో సీజ‌న్ విజేత‌గా నిలిచిన స్మృతి మంధాన సేన విజయోత్సాహంలో మునిగిపోగా, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మెగ్ లానింగ్ మాత్రం ఓట‌మి భారంతో క‌న్నీటిప‌ర్యంతమ‌యింది. వ‌రుస‌గా రెండోసారి టైటిల్ చేజార‌డంతో ఆమె క‌న్నీళ్లు పెట్టుకుంది. గ‌తేడాది కూడా ఢిల్లీ ఇలాగే ఫైన‌ల్‌లో ముంబై ఇండియ‌న్స్ చేతిలో ప‌రాజ‌యంతో క‌ప్పుకు అడుగుదూరంలోనే నిలిచిపోయింది. ఈసారి కూడా అదే సీన్ రీపిట్ అయింది. ఇలా వ‌రుస‌గా రెండుసార్లు ఫైన‌ల్‌లో ఓట‌మి చెంద‌డం త‌ట్టుకోలేక‌ ఢిల్లీ సార‌థి క‌న్నీళ్లు పెట్టుకుంది. దీని తాలూకు వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. 

ఆదివారం అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జ‌రిగిన డ‌బ్ల్యూపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. ఓపెన‌ర్లు ష‌ఫాలీ వ‌ర్మ (44), మెగ్ లానింగ్ (26).. 64 ప‌రుగుల శుభారంభం ఇచ్చారు. కానీ, ష‌ఫాలీ ఔట‌యిన త‌ర్వాత ఢిల్లీ వ‌రుస‌గా వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వ‌చ్చిన‌వారు వ‌చ్చిన‌ట్లు పెవిలియ‌న్‌కు క్యూక‌ట్టారు. దాంతో డీసీ కేవ‌లం 113 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. 114 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన బెంగ‌ళూరు రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి టార్గెట్‌ను సునాయాసంగా ఛేదించింది. ఎనిమిది వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించి తొలి డ‌బ్ల్యూపీఎల్ టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. 

అయితే, లీగ్ ద‌శ‌లో పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో నిలిచి నేరుగా ఫైన‌ల్‌కు దూసుకొచ్చిన ఢిల్లీ కీల‌క మ్యాచులో త‌డ‌బ‌డింది. ఫైన‌ల్‌లో ఓట‌మితో రెండోసారి టైటిల్‌ను చేజార్చుకుంది. దీంతో డీసీ కెప్టెన్ మెగ్ లానింగ్ ఎమోష‌న‌ల్ అయ్యింది. ఆస్ట్రేలియా కెప్టెన్‌గా ఐదు ప్ర‌పంచ క‌ప్‌లు గెలిచిన ఆమె.. డ‌బ్ల్యూపీఎల్‌లో వ‌రుస‌గా రెండుసార్లు ఫైన‌ల్‌లో బోల్తాప‌డ‌డంతో క‌న్నీళ్లు పెట్టుకుంది. ఢిల్లీ సార‌థి ఎమోష‌న‌ల్ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.
Meg Lanning
Delhi Capitals
Royal Challengers Bangalore
WPL 2024 Final
Cricket
Sports News

More Telugu News