Sabarmati-agra superfast Express: రాజస్థాన్‌లో పట్టాలు తప్పిన సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
- ఆదివారం అర్ధరాత్రి దాటాక ఘటన
- మాదర్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన శబర్మతీ-ఆగ్రా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
- రైలు ఇంజెన్‌తో పాటు నాలుగు బోగీలు పట్టాలు తప్పిన వైనం
- ప్రయాణికులు ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదన్న రైల్వే అధికారులు
రాజస్థాన్‌లో ఆదివారం అర్ధరాత్రి సబర్మతీ-ఆగ్రా సూపర్ ఫాస్ట్ రైలు పట్టాలు తప్పింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని రైల్వే అధికారులు తాజాగా వెల్లడించారు. మాదర్ రైల్వే స్టేషన్ సమీపంలో రాత్రి ఒంటిగంటకు రైలు ఇంజిన్‌తో పాటు నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి తామంతా గాఢ నిద్రలో ఉండగా పెద్ద శబ్దం వినిపించిందని, చివరకు రైలు పట్టాలను తప్పినట్టు తెలిసిందని కొందరు ప్రయాణికులు మీడియాకు తెలిపారు.
కాగా, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సుకు చెందిన సహాయబృందాలు, రైల్వే పోలీసులు, అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్, ఇతర ఉన్నతాధికారులు ఘటనాస్థలంలోనే ఉండి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. పట్టాలు తప్పిన బోగీలను మళ్లీ చక్కదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని రైల్వే పీఆర్ఓ శశికిరణ్ తెలిపారు. తమ బృందం త్వరలోనే పరిస్థితిని చక్కదిద్దుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు పరిస్థితిని దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారన్నారు. హెల్ప్‌లైన్ కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు.