Ravichandran Ashwin: ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు
- ఎల్బీడబ్ల్యూ ఔట్ల పట్ల స్టోక్స్ తీవ్ర ఆందోళన చెందాడన్న అశ్విన్
- స్టోక్స్ డిఫెన్స్ ఆడినప్పటికీ తాను అనుకున్న విధంగా ఔట్ చేశానని వెల్లడి
- ఇటీవల ముగిసిన 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌పై స్పిన్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు
తన బౌలింగ్‌లో వరుసగా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడం పట్ల ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తీవ్ర ఆందోళనకు లోనయ్యాడని టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యానించాడు. స్టోక్స్ రక్షణాత్మకంగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఫుల్లర్, వైడర్ బంతులు సంధించేందుకు అనుమతిస్తున్నట్టు తనకు అనిపిస్తుందని అశ్విన్ వెల్లడించాడు. స్టోక్స్ డిఫెన్స్ ఆడినప్పటికీ తాను అనుకున్న విధంగానే స్టోక్స్‌ను ఎల్బీడబ్ల్యూ చేశానని స్పిన్నర్ చెప్పుకొచ్చాడు. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’తో మాట్లాడుతూ అశ్విన్ ఈ విధంగా స్పందించాడు. స్టోక్స్ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రతి బంతిని ఫార్వర్డ్ ఆడడానికి ప్రయత్నిస్తుంటాడని పేర్కొన్నాడు. కాగా బెన్‌స్టోక్స్‌ని అశ్విన్ రికార్డు స్థాయిలో టెస్టులో ఔట్ చేశాడు. దీంతో అతడి బౌలింగ్‌లో ఆడేటప్పుడు స్టోక్స్ ఆచితూచి ఆడుతున్న విషయం తెలిసిందే.
ఐదు టెస్టుల సిరీస్‌లో 4-1 తేడాతో ఇంగ్లండ్ వెనుకబడ్డప్పటికీ ఆ జట్టు బాగానే ఆడిందని, భారత్ మరింత మెరుగైన క్రికెట్ ఆడిందని అశ్విన్ వ్యాఖ్యానించాడు. ఇటీవలే ముగిసిన ఈ సిరీస్‌లో అశ్విన్ అద్బుతంగా రాణించిన విషయం తెలిసిందే. చివరిదైన ధర్మశాల టెస్టులో కెరియర్లో 36వ 5 వికెట్లు సాధించాడు. దీంతో ఈ టెస్టులో భారత్ ఏకంగా ఇన్నింగ్స్ 34 పరుగుల తేడాతో భారీ జయకేతనం ఎగురవేసింది.