Modi On kavitha Arrest: కాళేశ్వరం నుంచి ఢిల్లీ దాకా బీఆర్ఎస్ అవినీతి: మోదీ

PM Modi First Reaction On Mlc Kavitha Arrest At Jagityal Sabha
  • అవినీతిపరులను వదిలిపెట్టే సమస్యేలేదన్న ప్రధాని
  • రాష్ట్రాన్ని దోచుకోవడమే కుటుంబ పార్టీల లక్ష్యమని ఆరోపణ
  • తమ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలంటూ మహిళలకు విజ్ఞప్తి
తెలంగాణను పదేళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ పార్టీ నేతల అవినీతి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పాకిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఢిల్లీ లిక్కర్ స్కామ్ దాకా ఆ పార్టీ నేతలు అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. జగిత్యాలలో సోమవారం జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టును పరోక్షంగా ప్రస్తావిస్తూ.. బీఆర్ఎస్ నేతల అవినీతిని సభా వేదికపై ఎండగట్టారు. 

తెలంగాణ వికాసం కోసం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించుకోవాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ను ఓడించి ఆ పార్టీ నేతలకు గుణపాఠం నేర్పాలని కోరారు. కవిత అరెస్ట్‌పై మోదీ మొదటిసారి స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్‌ఎస్ సర్కారు అవినీతికి పాల్పడగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆ పార్టీ నేతలు కమీషన్లు దండుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను ఏటీఎంలా వాడుకుందని ఆరోపించారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తోందని, కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండూ అవినీతి పార్టీలేనని మండిపడ్డారు.

బీఆర్ఎస్ ను కాపాడాలని చూస్తోందని, అందుకే అవినీతిపై విచారణ జరిపించడంలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, తాము మాత్రం అవినీతి పరులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని మోదీ స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నాయని విమర్శించారు. తాము మాత్రం రాష్ట్రాలను, దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించడానికి నిరంతరం పాటుపడుతున్నామని వివరించారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ గ్యారంటీ అని చెప్పారు.

రాష్ట్రాన్ని, దేశాన్ని దోచుకోవడమే లక్ష్యంగా పనిచేసే కుటుంబ పార్టీలను దూరంపెట్టాలని ప్రజలను కోరారు. మహిళా శక్తి చాలా గొప్పదని పేర్కొంటూ మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఆదరించాలని మోదీ పిలుపునిచ్చారు. బీజేపీకి ఓటేసి తనను ఆశీర్వదించాలని మహిళలను కోరారు. మహిళా శక్తిని కాంగ్రెస్ ప్రభుత్వం హేళన చేస్తోందని. మహిళలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవంలేదని ప్రధాని విమర్శించారు.
Modi On kavitha Arrest
Narendra Modi
Jagityal Sabha
BJP
Vijaya sankalpa sabha
Kaleshwaram Project

More Telugu News