KCR: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తా: కేసీఆర్ వెల్లడి
- భవిష్యత్తులో ప్రవీణ్ కుమార్‌కు మరిన్ని ఉన్నత పదవులలో అవకాశాలు కల్పిస్తామన్న కేసీఆర్
- రానున్న రోజుల్లో అద్భుతమైన విజయం సాధిస్తామని ధీమా
- అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం పోరాడాలని పిలుపు
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తానని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ప్రవీణ్ కుమార్ నేడు బీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... భవిష్యత్తులో ప్రవీణ్ కుమార్‌కు మరిన్ని ఉన్నత పదవులలో అవకాశాలు కల్పిస్తామన్నారు. పార్టీని నిర్మాణం చేసుకుందాం... కమిటీలు వేసుకుందామని తెలిపారు. ఇక్కడే నిరంతరం శిక్షణ తరగతులు నిర్వహించుకుందామని సూచించారు. రానున్న రోజుల్లో మనం అద్భుతమైన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
తాను తెలంగాణ ప్రజల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడానన్నారు. వందలాది సంఘటనలను ఉద్యమంలో చూశానని... ఆంధ్ర పాలనలో తెలంగాణ ప్రాంతాన్ని విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమం అంటే నినాదాలు చేస్తూ చేతిలో రాళ్లు పట్టుకోవడం కాదని... ఉద్యమానికి ఒక పద్ధతి , సిద్దాంతం ఉంటాయన్నారు. వ్యవసాయం స్థిరీకరణ జరగాలని రైతు బంధు తీసుకువచ్చినట్లు చెప్పారు. దళితబంధు తెచ్చినా దళిత సమాజం ఎందుకు ఈ పథకాన్ని అభినందించలేదని వాపోయారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో తాను పడ్డ అవమానాలు, తిట్లు, ఇబ్బందులు ఎవరూ పడలేదన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చి, కేంద్రంలో ఒక పదవి ఇస్తామని తనకు కొందరు ఆఫర్ చేశారని గుర్తు చేసుకున్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం పోరాడాలని... సమస్యలు పరిష్కరించాలన్నారు.
రాష్ట్రంలో దళిత బంధు ఇస్తే అంబేడ్కర్ మనవడు ఆశ్చర్యపోయారని పేర్కొన్నారు. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పేట్టి, అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది వచ్చి అంబేద్కర్ ఇల్లు అని అభినందించారన్నారు. తెలంగాణలో దళితుల మీద దాడి జరిగితే ఎందుకు నిలదీయడం లేదో చెప్పాలన్నారు.