Supreme Court: సీఏఏ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టు విచారణ
- దాఖలైన 230 పిటిషన్లు
- చట్టంపై స్టే విధించాలని కోరిన పలువురు పిటిషనర్లు
- చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్‌మిశ్రాలతో కూడిన బెంచ్ విచారణ
ఇటీవల దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం సీఏఏను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై నేటి (మంగళవారం) నుంచి సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. పెద్ద సంఖ్యలో 230 పిటిషన్లు దాఖలయ్యాయి. సీఏఏ సెక్షన్ 6బీ కింద ఎవరికీ పౌరసత్వం ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని, సీఏఏ చట్టంపై స్టే ఇవ్వాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పిటిషన్ దాఖలు చేశారు.
ఇక సీఏఏ చట్టం కింద భారత పౌరసత్వం పొందలేకపోతున్న ముస్లిం వలసజీవులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందంటూ కేరళకు చెందిన ఇండియన్ ముస్లిం లీగ్ ఆందోళన వ్యక్తం చేసింది. తమ అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకొని చట్టంపై స్టే విధించాలని కోరింది. ఇదే తరహాలో మరిన్ని సంస్థలు, వ్యక్తులు సీఏఏ చట్టాన్ని సవాలు చేశాయి. ఈ పిటిషన్లు అన్నింటిపై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్‌మిశ్రాలతో కూడిన బెంచ్ విచారణ జరపనుంది.
కాగా పార్లమెంటు ఆమోదించిన నాలుగేళ్ల తర్వాత సీఏఏ చట్టాన్ని మార్చి 11న కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 31, 2014కు ముందు బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వం కల్పించడమే ఈ చట్టం ఉద్దేశ్యం. అయితే ఈ చట్టం కింద ముస్లింలకు భారత పౌరసత్వాన్ని నిరాకరించడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే.