Steve Huffman: రూ. 1600 కోట్లు జీతం.. నెట్టింట విమర్శలు.. కంపెనీ సీఈఓ వివరణ ఇదీ!
- రెడ్డిట్ సీఈఓ స్టీవ్ హఫ్‌మన్ వేతనంపై విమర్శలు
- హఫ్‌మన్ భారీ వేతన ప్యాకేజ్‌పై కోరా, ఎక్స్ వంటి ప్లాట్‌ఫాంలలో యూజర్ల మధ్య హాట్ డిబేట్
- తన సామర్థ్యం ఆధారంగానే రెడ్డిట్ యాజమాన్యం తన వేతన ప్యాకేజ్‌ను నిర్ధారించిందన్న హఫ్‌మన్
కరోనా తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అన్నీ రంగాలు నష్టాలను చవిచూశాయి. ఇక టెక్ రంగం కూడా దీనికి మినహాయింపు ఏమీ కాదు. దాంతో ప్రముఖ టెక్ కంపెనీలు తమ వ్యయ భారాన్ని తగ్గించుకునేందుకు చర్యలకు ఉపక్రమించాయి. దీనిలో భాగంగా భారీ మొత్తంలో ఉద్యోగులను తొలగించాయి. ఇప్పటికీ కొన్ని టెక్ సంస్థలు భారీ వేతనాలు అందుకుంటున్న ఉద్యోగులకు లేఆఫ్స్ ఇస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని కంపెనీల సీఈఓలకు కోట్లలో వేతనాలు ఉండడం పట్ల ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల రెడ్డిట్ సీఈఓ స్టీవ్ హఫ్‌మన్ జీతం పట్ల కూడా విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ విమర్శలపై తాజాగా హఫ్‌మన్ స్పందించారు. ఈ సందర్భంగా తన భారీ వేతన ప్యాకేజ్‌ను ఆయన సమర్థించుకోవడం గమనార్హం. ప్రస్తుతం రెడ్డిట్ సీఈఓగా ఆయన సుమారు రూ. 1600కోట్ల వేతన ప్యాకేజ్‌ను అందుకుంటున్నారు. దీనిపై కోరా, ఎక్స్ వంటి పలు ప్లాట్‌ఫాంలలో యూజర్ల మధ్య హాట్ డిబేట్‌కు దారితీసింది. హఫ్‌మన్‌కు ఇంతటి భారీ ప్యాకేజ్ అవసరమా అంటూ యూజర్లు కామెంట్ చేయడం మొదలెట్టారు.
దీంతో ఈ వివాదంపై రెడ్డిట్ బాస్ రెడ్డిట్ వేదికగానే స్పందించారు. రెడ్డిట్ వేదికగా క్యూ అండ్ ఏ సెషన్‌లో వివరణ ఇచ్చారు. తన సామర్థ్యం ఆధారంగానే రెడ్డిట్ యాజమాన్యం తన వేతన ప్యాకేజ్‌ను నిర్ధారించిందని చెప్పుకొచ్చారు.
హఫ్‌మన్ వేతనం ఓ ప్రముఖ పబ్లిక్ కార్పొరేషన్ సీఈఓకు దీటుగా ఉందని పలువురు చెబుతున్నారు. అలాగే ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, ఎలన్ మస్క్‌ల వేతన ప్యాకేజ్‌తో కొందరు హఫ్‌మన్ పే ప్యాకేజ్‌ను పోల్చి చూస్తున్నారు.