CAA: సీఏఏని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ... కేంద్రానికి నోటీసులు
- సీఏఏను అమల్లోకి తెచ్చిన కేంద్రం
- కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత
- సీఏఏపై స్టే ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో 230 పిటిషన్లు దాఖలు
- స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సీజేఐ బెంచ్
కేంద్రం ఇటీవల సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం) అమల్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే సీఏఏను వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. సీఏఏ అమలుపై స్టే ఇవ్వాలంటూ 230 పిటిషన్లు దాఖలు కాగా, సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది.
ఈ పిటిషన్లను సీజేఐ చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ జేబీ పార్ధీవాలాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. సీఏఏ అమలుపై స్టే ఇచ్చేందుకు సీజేఐ బెంచ్ నిరాకరించింది. ఈ క్రమంలో, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
సీఏఏ వద్దంటూ దాఖలైన పిటిషన్లపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అందుకు మూడు వారాల గడువు విధించింది. అనంతరం, తదుపరి విచారణను ఏప్రిల్ 9కి వాయిదా వేసింది. కేంద్రం ఏప్రిల్ 8వ తేదీ నాటికి వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.