happiest countries: ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాల జాబితా విడుదల

List of happiest countries in the world in 2024 released by UNO
  • వరుసగా ఏడవసారి అగ్రస్థానంలో నిలిచిన ఫిన్‌లాండ్
  • గతేడాది మాదిరిగానే 126వ స్థానంలో నిలిచిన భారత్
  • టాప్ 20 చోటు దక్కించుకోలేకపోయిన అమెరికా
  • చిట్టచివరన 143వ స్థానంలో నిలిచిన ఆఫ్ఘనిస్థాన్
ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో ఫిన్‌లాండ్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. వరుసగా ఏడవసారి 2024లో కూడా ఆ దేశం టాప్ ప్లేస్‌లో నిలిచిందని ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన తాజా రిపోర్ట్ పేర్కొంది. నార్డిక్ దేశాలైన డెన్మార్క్, ఐస్‌లాండ్, స్వీడన్ టాప్-10 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. 2020లో తాలిబన్ నియంత్రణలోకి వెళ్లిన ఆఫ్ఘనిస్థాన్ చిట్టచివరన 143వ స్థానంలో నిలిచింది. ఇక భారత్ గతేడాది మాదిరిగానే 126వ స్థానంలో నిలిచింది. మొత్తం 143 దేశాలను పరిగణనలోకి తీసుకున్నట్టు రిపోర్ట్ పేర్కొంది. 12వ స్థానంలో కోస్టారికా, 13వ ర్యాంకులో కువైట్ నిలిచాయి.  

 కాగా ఈ నివేదికను ప్రచురించడం మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటిసారి అమెరికా, జర్మనీ టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయాయి. యూఎస్ఏ 23వ స్థానంలో, జర్మనీలు 24వ ర్యాంకులో నిలిచాయి. ఎక్కువ జనాభా కలిగిన దేశాలు ర్యాంకింగ్స్‌లో వెనుకబడ్డాయని రిపోర్ట్ తెలిపింది. 

టాప్ 10 దేశాలలో నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా దేశాలలో మాత్రమే 15 మిలియన్ల కంటే ఎక్కువ జనాభా ఉన్నారు. టాప్ 20 దేశాలలో కెనడా, యూకే మాత్రమే 30 మిలియన్లకు పైగా జనాభాను కలిగి ఉన్నాయని ఐరాస రిపోర్ట్ తెలిపింది. జీవితంపట్ల సంతృప్తి, దేశ తలసరి జీడీపీ, సామాజిక మద్దతు, ఆయుర్దాయం, స్వేచ్ఛ, దాతృత్వం వంటి అంశాల ఆధారంగా దేశాల ర్యాంకింగ్‌ను నిర్ణయించినట్టు వెల్లడించింది.
happiest countries
United Nations
Finland
USA
India

More Telugu News