Mammootty: ఒకే నెలలో మూడు బ్లాక్ బస్టర్లు .. ఆశ్చర్యపరుస్తున్న మలయాళ ఇండస్ట్రీ!
- ఫిబ్రవరి 9న మలయాళంలో విడుదలైన 'ప్రేమలు'
- 3 కోట్లతో 125 కోట్లు తెచ్చిపెట్టిన రొమాంటిక్ లవ్ స్టోరీ
- ఫిబ్రవరి 15న ఫోక్ హారర్ గా విడుదలైన 'భ్రమయుగం'
- చాలా తక్కువ సమయంలో రాబట్టిన 85 కోట్ల వసూళ్లు
- 20 కోట్లతో 200 కోట్లు రాబట్టిన 'మంజుమ్మెల్ బాయ్స్'
- అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్న మలయాళ ఇండస్ట్రీ
ఒకప్పుడు మలయాళ సినిమాల స్థితి వేరు .. ఇప్పుడు మలయాళ సినిమాల పరిస్థితి వేరు. కొత్త దర్శకులు .. వాళ్లు చేస్తున్న ప్రయోగాలు .. కొత్త ఆర్టిస్టులు .. వాళ్లు ఆవిష్కరిస్తున్న సహజత్వం ఆశ్చర్య పరుస్తున్నాయి. కథ .. కథనం .. సన్నివేశాలు .. సహజత్వానికి చాలా దగ్గరగా ఉండేలా వాళ్లు చూసుకుంటున్నారు. ఒక చిన్న ఆసక్తికరమైన పాయింటును పట్టుకుని అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఈ కారణంగానే మలయాళ అనువాదాలను చూడటానికి ఇతర భాషా ప్రేక్షకులు సైతం ఆసక్తిని కనబరుస్తున్నారు.
ఈ ఏడాదిలో మలయాళంలో వచ్చిన సినిమాలు .. అవి సాధించిన విజయాల సంగతి అలా ఉంచితే, ఒక్క ఫిబ్రవరి నెలలోనే మూడు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను ఇండస్ట్రీ అందించింది. ఫిబ్రవరి 9వ తేదీన మలయాళంలో విడుదలైన 'ప్రేమలు' సినిమా, కేవలం 3 కోట్లతో నిర్మించారు. ఇప్పుడు ఆ సినిమా 125 కోట్ల మార్క్ ను టచ్ చేసింది. గిరీశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తెలుగులోను కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక ఫిబ్రవరి 15వ తేదీన అక్కడ విడుదలైన 'భ్రమయుగం' కూడా ఘనవిజయాన్ని అందుకుంది. 27 కోట్లతో నిర్మించిన ఈ సినిమా, ఇప్పుడు 85 కోట్ల మార్కును దాటేసింది. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఒకే ఇంట్లో .. మూడే మూడు పాత్రలతో నడుస్తుంది. పైగా ఈ సినిమాను బ్లాక్ అండ్ వైట్ లో తీశారు. 70 శాతం కథ వర్షంలో నడవడం విశేషం. ఓటీటీలోనూ ఈ సినిమా వ్యూస్ రాకెట్ స్పీడ్ తో పెరిగిపోతుండటం గమనించవలసిన విషయం. అలాంటి ఈ సినిమాకి ఇక్కడి థియేటర్స్ నుంచి లభించిన ఆదరణ చాలా తక్కువ. ఇక ఫిబ్రవరి 22వ తేదీన మలయాళంలో 'మంజుమ్మెల్ బాయ్స్' సినిమా విడుదలైంది. యథార్థ సంఘటన ఆధారంగా నిర్మితమైన ఈ సినిమాకి, చిదంబరం దర్శకత్వం వహించాడు. ఒక గుహలో చిక్కుబడిపోయిన కుర్రాళ్లు అందులో నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. కేవలం 20 కోట్లతో నిర్మించిన ఈ సినిమా, 200 కోట్ల మార్క్ ను దాటిపోవడం విశేషం. ఇలా అతి తక్కువ బడ్జెట్ తో నిర్మితమైన మూడు సినిమాలు .. భారీ వసూళ్లతో దూసుకుపోతుండటం నిజంగా గొప్ప విషయమే. అందుకే ఇప్పుడు మిగతా ఇండస్ట్రీలన్నీ మలయాళం సినిమాల వైపు ఆసక్తిగా .. ఆతృతగా చూస్తున్నాయి.