Atchannaidu: చంద్రబాబు రాజకీయ వికలాంగుడన్న పెద్దిరెడ్డి.... అంత అహంకారమా? అంటూ అచ్చెన్న ఫైర్

Atchannaidu counters minister Peddireddy remarks on Chandrababu
  • ఏపీలో జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ
  • చంద్రబాబు పొత్తులు  లేకుండా నిలబడలేడన్న మంత్రి పెద్దిరెడ్డి
  • మాఫియాతో పొత్తులు లేకుండా నువ్వు నిలబడగలవా అంటూ అచ్చెన్న కౌంటర్
టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తులు లేకుండా నిలబడలేడని, చంద్రబాబు ఓ రాజకీయ వికలాంగుడు అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. చంద్రబాబు వికలాంగుడు అంటూ చేసిన వ్యాఖ్యలను పెద్దిరెడ్డి వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

మాఫియాల పొత్తు లేకుండా పెద్దరెడ్డి నిలబడలేడు అని విమర్శించారు. స్వేచ్ఛగా పోలింగ్ జరిగితే పెద్దిరెడ్డి పుంగనూరులో ఓడిపోతాడని వెల్లడించారు. హత్యాకాండ బాధితుల కారణంగా పెద్దిరెడ్డే వికలాంగుడౌతారేమో అని అచ్చెన్న వ్యాఖ్యానించారు. వైసీపీకి అంత సత్తా ఉంటే పొత్తులపై ఎందుకు విషం కక్కుతున్నారు? అని ప్రశ్నించారు. 

"చంద్రబాబు రాజకీయ వికలాంగుడంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అహంకార పూరితంగా నోరుపారేసుకున్నాడు. పెద్దిరెడ్డి ఎన్నో హత్యలు చేయించాడు. ఈ హత్యలకు బలైన కుటుంబాల చేతుల్లో ఎప్పుడో ఒకప్పుడు పెద్దిరెడ్డి వికలాంగుడౌతాడేమోనని అతని అంతరాత్మ చెబుతున్నట్టున్నది. అందుకే పెద్దిరెడ్డి తన స్థితిని చంద్రబాబుకు అంటగట్టి నోరుపారేసుకుంటున్నాడు. 

రౌడీలు, మాఫియాలు, కళంకిత పోలీసుల పొత్తు లేకుండా పెద్దిరెడ్డి పుంగనూరులో గెలవలేడనేది కొండంత సత్యం. అందుకే 700 మందిపై అక్రమ కేసులు పెట్టించాడు. ప్రతిపక్ష నేతల ఇళ్లు, కార్యాలయాలు ధ్వంసం చేయించాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసకు పాల్పడి నామినేషన్లు వేయకుండా అడ్డుకొన్నాడు. 

పొత్తులు పెట్టుకొన్నందుకు చంద్రబాబును రాజకీయ వికలాంగుడంటున్న పెద్దిరెడ్డికి దమ్ముంటే పొత్తులపై నరేంద్రమోదీని ఆ మాట అనగలడా? 

టీడీపీ పొత్తలు బహిరంగం. జగన్ రెడ్డివి చీకటి పొత్తులు కాదా? మాఫియాలతో, కళంకితులతో జగన్ పొత్తులు ప్రజలకు తెలుసు. 

రావణ వధ కోసం శ్రీరాముడే వానరులతో పొత్తు పెట్టుకున్నాడు. దోపిడీ, నేరాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజా ఆకాంక్ష మేరకే టీడీపీ పొత్తులు. వైసీపీకి సత్తా ఉంటే పొత్తులపై మాపై ఏడవడం ఎందుకు?" అని అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు.
Atchannaidu
Peddireddi Ramachandra Reddy
Chandrababu
TDP
YSRCP
TDP-JanaSena-BJP Alliance

More Telugu News