Zaheer Khan: ధోనీ ఏం చేసినా దాని వెనుక ఓ ఆలోచన ఉంటుంది: జహీర్ ఖాన్
- కొందరు క్రికెటర్లు రిటైరయ్యాక ఇబ్బందులు పడుతుంటారన్న జహీర్
- జీవితంపై ప్లానింగ్ లేక కష్టాలు ఎదుర్కొన్న వారిని చూశానని వెల్లడి
- ధోనీ అందుకు భిన్నం అని వివరణ
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఆలోచించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోడని పేస్ బౌలింగ్ దిగ్గజం జహీర్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. చాలామంది క్రికెటర్లు ఆటకు వీడ్కోలు పలికాక జీవితంలో ఏం చేయాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొన్నవారిని చూశానని, కానీ ధోనీకి అలాంటి పరిస్థితి రాదని అన్నాడు.
"కెరీర్ కొనసాగుతున్నప్పుడు ఆటగాళ్లకు క్రికెట్ తప్ప మరో వ్యాపకం ఉండదు. కానీ ఆటకు రిటైర్ మెంట్ ప్రకటించాక ఏం చేయాలన్నదానిపై చాలామందికి స్పష్టత ఉండదు. క్రికెట్ ఆడేటప్పుడు 100 శాతం అంకితభావంతో ఆడినవాళ్లు కూడా రిటైరయ్యాక కష్టపడడాన్ని చూశాను.
ధోనీ అందుకు భిన్నం. క్రికెటేతర అంశాలపైనా అతడు ఆసక్తిని పెంచుకుని రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలో ముందే నిర్ణయించుకున్నాడు. తన అభిరుచులను కూడా వ్యాపకాలుగా మలుచుకున్నాడు.
బైకులంటే ధోనీకి ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. రిటైరయ్యాక వాటిపై పరిశోధన చేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. క్రికెట్టే జీవితం కాదని ధోనీ ఎప్పుడో అర్థం చేసుకున్నాడు. జీవితంలో క్రికెట్ ఓ భాగం మాత్రమేనని గుర్తించాడు. అందుకు అనుగుణంగా తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్నాడు" అని జహీర్ ఖాన్ వివరించారు.