ISIS: అస్సాంలో పట్టుబడ్డ ఐసిస్ ఇండియా చీఫ్ హరీస్ ఫారూఖీ
- ఫారుఖీతో పాటు అదుపులోకి మరో కీలక ఉగ్రవాది
- చిన్న క్లూ అందడంతో రంగంలోకి దిగి పట్టుకున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్
- బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన వెంటనే పట్టుకున్న పోలీసులు
- ఎన్‌ఐఏకి అప్పగించనున్న అస్సాం పోలీసులు
కరుడుగట్టిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ భారత చీఫ్ హారిస్ అజ్మల్ ఫారూఖీను (అలియాస్ అజ్మల్ ఫారూఖీ) అస్సాం పోలీసులు పట్టుకున్నారు. చిన్న క్లూ అందడంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగాయని, ఫారూఖీతో పాటు అతడి వెంట ఉన్న కీలక సహాయకుడిని అరెస్ట్ చేసినట్టు అస్సాం పోలీస్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ప్రణబ్ జ్యోతి గోస్వామి ప్రకటించారు. వీరిద్దరూ బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి ప్రవేశించారని, బుధవారం అస్సాంలోని ధుబ్రి ప్రాంతంలో పట్టుబడ్డారని తెలిపారు. అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలో ఇద్దరినీ పట్టుకున్నామని, బుధవారం ఉదయం 4:15 గంటల సమయంలో నిందితులు సరిహద్దును దాటిన తర్వాత ధుబ్రిలోని ధర్మశాల ప్రాంతంలో గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు. గువహాటిలోని ఎస్‌టీఎఫ్ కార్యాలయానికి తరలించామని, ఇద్దరినీ ఎన్ఐఏకి అప్పగించనున్నట్టు చెప్పారు.
ఇద్దరి గుర్తింపు వివరాలను పోలీసులు నిర్ధారించారు. హారిస్ ఫారూఖీ డెహ్రాడూన్‌లోని చక్రతాకు చెందినవాడని, ఐఎస్ఐఎస్ ఛీఫ్‌గా వ్యవహరిస్తున్నాడని గోస్వామి చెప్పారు. మరోవైపు ఫారూఖీతో పాటు పట్టుబడ్డ వ్యక్తి పేరు అనురాగ్ సింగ్ అని, పానిపట్‌కు చెందిన ఇతడు రెహాన్ అని పేరు మార్చుకొని ఇస్లాంలోకి మారాడని వెల్లడించారు. అయితే ఇతడు బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ మహిళను పెళ్లి చేసుకున్నాడని వివరించారు. వీరిద్దరూ భారత్‌లో ఐసిస్ ముఖ్యమైన నాయకులని, సంస్థ సభ్యులను ఉగ్రవాద దాడులకు ప్రేరేపిస్తుంటారని వెల్లడించారు. భారత్‌లోని అనేక ప్రదేశాలలో ఐఈడీలు ఉపయోగించి పేలుడు కుట్రలకు పాల్పడ్డారని ప్రణబ్ జ్యోతి గోస్వామి చెప్పారు. రిక్రూట్‌మెంట్, నిధులు సేకరణ చేస్తుంటారని వివరించారు.