Nara Bhuvaneswari: నారా భువనేశ్వరిని కలిసిన కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు
- ఇటీవల ‘నిజం గెలవాలి’ కార్యక్రమానికి వెళ్తున్న చంద్రబాబు భార్యను కలిసిన కానిస్టేబుల్ సాకిరి రాజశేఖర్
- ఫిర్యాదులు అందడంతో సస్పెండ్ చేస్తూ ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ నిర్ణయం
- ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని అధికారులు, సిబ్బందిని హెచ్చరించిన ఎస్పీ
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరిని కలిసిన సాకిరి రాజశేఖర్ అనే కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఆదేశాలు జారీ చేశారు. పలు ఫిర్యాదులు అందడంతో విచారణ చేపట్టిన అనంతరం కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ వివరించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ హెచ్చరించారు. వ్యక్తిగత అభిప్రాయాలను బహిర్గతపరచడం, రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని, చట్టప్రకారం చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కృష్ణకాంత్ పటేల్ హెచ్చరించారు.
కాగా ఇటీవల అన్నమయ్య జిల్లాలో ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరుపతి జిల్లా భాకరాపేట మీదుగా నారా భువనేశ్వరి వెళ్తుండగా సాకిరి రాజశేఖర్ కలిశారని తేలింది. తిరుపతి దిశ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న అతడు నిబంధనలను అతిక్రమించారని నిర్ధారణ అయ్యింది.