AP CEO: ఏపీ ఎలక్షన్స్: సీఈవో ఎదుట హాజరైన పల్నాడు, ప్రకాశం, నంద్యాల ఎస్పీలు
- ఏపీలో ఎన్నికల కోడ్ అమలు
- ఆళ్లగడ్డ, గిద్దలూరులో రెండు హత్యలు
- రాజకీయ హత్యలంటున్న విపక్షాలు
- మాచర్లలో ఓ పార్టీకి చెందిన కారు దగ్ధం
- వివరణ ఇవ్వాలంటూ మూడు జిల్లాల ఎస్పీలకు సీఈవో ఆదేశాలు
ఏపీలో ఈ నెల 16 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కోడ్ వచ్చిన తర్వాత ఆళ్లగడ్డ, గిద్దలూరులో రెండు హత్యలు జరగ్గా, ఇవి రాజకీయ హత్యలంటూ విపక్షాలు భగ్గుమన్నాయి. మాచర్లలో ఓ పార్టీకి చెందిన కారును తగలబెట్టడం మరింత కాకరేపింది.
ఈ పరిణామాలను రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. హింసను ఎందుకు ఆపలేకపోయారో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనా మూడు జిల్లాల ఎస్పీలను ఆదేశించారు. పల్నాడు, ప్రకాశం, నంద్యాల ఎస్పీలను తన ఎదుట హాజరు కావాలని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డి నేడు ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా ఎదుట హాజరయ్యారు. ఆయా ఘటనలపై ఎస్పీలు ఇచ్చే వివరణ ఆధారంగా సీఈవో చర్యలు తీసుకోనున్నారు. ఎస్పీల వివరణ సంతృప్తికరంగా లేకపోతే వారిపై బదిలీ వేటు పడే అవకాశం ఉంది.