YS Sharmila: వైఎస్ అవినాశ్ వల్ల కడపకు ఏం ఉపయోగం?.. పార్టీ ఆదేశిస్తే కడప నుంచి పోటీ చేస్తా: షర్మిల
- కడప నేతలతో షర్మిల సమావేశం
- కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం అవినాశ్ పోరాటం చేయలేదని విమర్శ
- సజ్జల గారూ.. ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్య
కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ కు సొంత కజిన్ అని... అయినా, కడపకు ఆయన చేసిందేమీ లేదని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. కడప స్టీల్ ప్లాంట్ ను అవినాశ్ ఎందుకు సాధించలేకపోయారని ప్రశ్నించారు. పార్టీ అధిష్ఠానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేయడానికి తాను సిద్ధమని చెప్పారు. ఎవరైనా సరే, ఏ స్థాయిలో ఉన్నా సరే పోటీకి తాను సిద్ధమని అన్నారు. పార్టీ ఆదేశిస్తే కడప నుంచి కూడా పోటీకి సిద్ధమేనని చెప్పారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో కడప నేతలతో షర్మిల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
సజ్జల రామకృష్ణారెడ్డి గారూ... ప్రజా సమస్యలపై మాట్లాడకుండా ఎప్పుడూ తమ గురించే ఎందుకు ఆలోచిస్తున్నారు? అని ప్రశ్నించారు. మిమ్మల్ని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం అవినాశ్ రెడ్డి ఎందుకు పోరాటం చేయలేదో జగన్, సజ్జల చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తామని 1,500 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. దరఖాస్తులను పరిశీలిస్తున్నామని, సర్వేలు జరుగుతున్నాయని... అధిష్ఠానం ఆమోదం తర్వాత త్వరలోనే కాంగ్రెస్ జాబితా ఉంటుందని తెలిపారు.