AP CEO: ప్రకాశం, పల్నాడు, నంద్యాల జిల్లాల ఎస్పీలతో ముగిసిన సీఈవో సమావేశం
- ఆళ్లగడ్డ, గిద్దలూరు రాజకీయ హత్యలు... మాచర్లలో కారు దగ్ధం
- మండిపడుతున్న విపక్షాలు
- మూడు జిల్లాల ఎస్పీలను పిలిపించిన సీఈవో
- ఒక్కొక్కరితో విడివిడిగా సమావేశం
- వారి వివరణలను కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించనున్న వైనం
ఇటీవల ఆళ్లగడ్డ, గిద్దలూరులో జరిగిన హత్యలు, మాచర్లలో కారు దగ్ధం ఘటనలకు సంబంధించి... పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల ఎస్పీలను రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా వివరణ కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డి నేడు సీఈవో ఎదుట హాజరయ్యారు. ఈ సమావేశం కొద్దిసేపటి కిందట ముగిసింది.
ముగ్గురు ఎస్పీలతో సీఈవో మీనా విడివిడిగా సమావేశం అయ్యారు. శాంతిభద్రతలపై ఎందుకు నిర్లక్ష్యం వహించారని ప్రశ్నించారు. రాజకీయ హత్యలు జరిగే వరకు ఎందుకు వేచి చూడాల్సి వచ్చిందని వివరణ కోరినట్టు తెలుస్తోంది! గిద్దలూరు, ఆళ్లగడ్డలో జరిగిన హత్యల వివరాలను సీఈవో అడిగి తెలుసుకున్నారు. మాచర్లలో ఓ పార్టీ కారును తగలబెట్టిన ఘటనలో పోలీసుల వైఫల్యం చోటు చేసుకోవడం ఏంటని పల్నాడు ఎస్పీని ప్రశ్నించారు.
కోడ్ అమల్లోకి వచ్చాక కూడా నిర్లక్ష్యం వహించారంటూ ఎస్పీలపై సీఈవో అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఏపీలో శాంతిభద్రతలపై కేంద్ర ఎన్నికల సంఘం నేరుగా నిఘా పెట్టిందని ముఖేశ్ కుమార్ మీనా వారికి తెలిపారు.
కాగా, ముగ్గురు ఎస్పీల వివరణలను సీఈవో కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్నారు. ఈ వివరణను పరిశీలించిన మీదట కేంద్ర ఎన్నికల సంఘం అవసరమైతే చర్యలు తీసుకోనుంది.