Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్‌లను అరెస్ట్ చేసింది ఒకే ఈడీ అధికారి
- ఢిల్లీ సీఎం, ఝార్ఖండ్ మాజీ సీఎంలను అరెస్ట్ చేసిన ఈడీ అదనపు డైరెక్టర్ కపిల్ రాజ్
- మనీలాండరింగ్ ఆరోపణలపై ఇద్దరి అరెస్ట్
- అరెస్ట్‌కు ముందు ఇద్దరినీ ప్రశ్నించిన ఈడీ అధికారులు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ సంచలనంగా మారింది. ఈ కేసులో మనీలాండరింగ్ అభియోగాలపై గురువారం రాత్రి ఆయనను ఈడీ అడిషనల్ డైరెక్టర్ కపిల్ రాజ్ అరెస్టు చేశారు. ఇటీవల ఝార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్‌ను కూడా అరెస్ట్ చేసింది ఈ అధికారే కావడం గమనార్హం. కేజ్రీవాల్‌ను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ చేయగా.. హేమంత్ సోరెన్‌ను భూ కుంభకోణానికి సంబంధించిన పీఎంఎల్ఏ కేసులో అరెస్టు చేశారు. కపిల్ రాజ్ సారధ్యంలోని 10 మంది అధికారుల బృందం గురువారం రాత్రి కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకుంది. ఇక హేమంత్ సోరెన్‌ను జనవరి 31న దాదాపు 6 గంటల విచారణ అనంతరం అరెస్టు చేశారు. ఇక కేజ్రీవాల్ మాదిరిగానే సోరెన్ కూడా ఈడీ సమన్లను దాటవేశారు. సీఎంగా ఉన్న సమయంలో ఆయనకు తొమ్మిదిసార్లు సమన్లు అందాయి. కానీ ఆయన విచారణకు హాజరుకాలేదు.
కేజ్రీవాల్ అరెస్ట్ సమయంలో ఎలాంటి హైటెన్షన్ వాతావరణం నెలకొందో.. హేమంత్ సోరెన్ అరెస్ట్ సమయంలోనూ ఇవే పరిస్థితులు కనిపించాయి. కస్టడీలోకి తీసుకునే ముందు ఈడీ అధికారులు కొద్దిసేపు ప్రశ్నించారు. జనవరి 31న రాంచీలో హైడ్రామా తర్వాత అరెస్ట్ అయ్యారు. అరెస్ట్‌కు హేమంత్ సోరెన్ దాదాపు 48 గంటలపాటు కనిపించకపోవడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ తర్వాత పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. ఈడీ అరెస్టుకు ముందే రాజీనామాపై పార్టీలో అంతర్గతంగా చర్చించారు. ఆ తర్వాత ఈడీ అరెస్ట్ చేయడం, సీఎం పదవికి ఆయన రాజీనామా చేయడం, ఝార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా చంపాయ్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి.
కాగా అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశాలు కనిపించడం లేదు. కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని ఆప్ నేతలు గురువారం రాత్రి ప్రకటించారు. దీంతో ఆయన ఈడీ కార్యాలయం నుంచి బాధ్యతలు నిర్వర్తించనున్నట్టు తెలుస్తోంది.