Election Commission: రూ.ల‌క్ష అంత‌కు మించి బ్యాంకు లావాదేవీల‌పై నిఘా పెట్టాల‌ని రాష్ట్రాల‌కు ఈసీ లేఖ‌

Central Election Commission Letter to State Governments for Bank Transactions

  • ఎన్నిక‌లపై డబ్బు ప్ర‌భావాన్ని క‌ట్ట‌డి చేసేందుకు రాష్ట్రాల‌ను అప్ర‌మ‌త్తం చేసిన‌ కేంద్ర ఎన్నిక‌ల సంఘం
  • రాజ‌కీయ పార్టీల ఖాతాల నుంచి చేప‌ట్టే లావాదేవీలపై నిఘా పెట్టాలని సూచ‌న‌
  • రూ. 10 ల‌క్ష‌ల‌కు మించి న‌గ‌దు విత్‌డ్రా లేదా జ‌మ‌పై త‌ప్ప‌నిస‌రిగా నిఘా పెట్టాలన్న ఎన్నిక‌ల సంఘం 

ఎన్నిక‌లపై డబ్బు ప్ర‌భావాన్ని క‌ట్ట‌డి చేసేందుకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం రాష్ట్రాల‌కు కీల‌క సూచ‌న‌లు చేసింది. బ్యాంకుల నుంచి రూ.ల‌క్ష అంత‌కు మించి చేప‌ట్టిన లావాదేవీల‌పై నిఘా పెట్టాల‌ని రాష్ట్రాల‌కు ఈసీ లేఖ రాసింది. బ్యాంకు ఖాతాల నుంచి ఉప‌సంహ‌ర‌ణ‌, డిపాజిట్ చేసినా అందుకు సంబంధించిన వివ‌రాల‌ను ఆరా తీయాల‌ని సూచించింది. దేశ‌వ్యాప్తంగా లోక్‌స‌భ‌తో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ మేర‌కు లేఖ రాసింది. 

"రూ. ల‌క్ష అంత‌కుమించి నిర్వ‌హించే లావాదేవీల వివ‌రాల‌ను అన్ని బ్యాంకుల నుంచి జిల్లా ఎన్నిక‌ల అధికారులు తెప్పించుకోవాలి. వాటిని విశ్లేషించే బాధ్య‌త‌ను సంబంధిత సిబ్బందికి అప్ప‌గించాలి. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఒకే బ్యాంకు బ్రాంచి నుంచి వేర్వేరు ఖాతాల‌కు సొమ్మును బ‌దిలీ చేస్తున్న దాఖ‌లాల‌పై ఫిర్యాదులు వ‌స్తున్నాయి. ఓట‌ర్లను ప్ర‌భావితం చేసేందుకు వివిధ మార్గాల ద్వారా న‌గ‌దు లావాదేవీలు చేప‌ట్టే అవ‌కాశం ఉంది. రాజ‌కీయ పార్టీల ఖాతాల నుంచి చేప‌ట్టే లావాదేవీలపై నిఘా పెట్టాలి.

ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న అభ్య‌ర్థి, ఆయ‌న భార్య, అభ్య‌ర్థిపై ఆధార‌ప‌డిన వారి బ్యాంకు ఖాతాల నుంచి రూ. ల‌క్ష‌కు మించి నిర్వ‌హించే లావాదేవీల‌ను అఫిడ‌విట్‌లో న‌మోదు చేయాలి. ఆ వివ‌రాల‌ను రాష్ట్ర ముఖ్య ఎన్నిక‌ల అధికారుల వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలి. ఎన్నిక‌ల షెడ్యూల్ వెలువ‌డ‌టానికి రెండు నెల‌ల ముందు నుంచి జ‌రిగిన లావాదేవీల‌ను ప‌రిశీలించేందుకు ఏర్పాట్లు చేయాలి. రూ. 10 ల‌క్ష‌ల‌కు మించి న‌గ‌దు విత్‌డ్రా లేదా జ‌మ‌పై త‌ప్ప‌నిస‌రిగా నిఘా పెట్టాలి. ఆయా వివ‌రాల‌ను ఆదాయ ప‌న్నుశాఖ నోడ‌ల్ అధికారుల‌కు అంద‌జేయాలి" అని ఈసీ రాష్ట్రాల‌కు రాసిన లేఖ‌లో పేర్కొంది.

  • Loading...

More Telugu News