MS Dhoni: కెప్టెన్సీ నుంచి ధోనీ అందుకే తప్పుకున్నాడు.. సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్
- సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవాలన్నది ధోనీ నిర్ణయమేనన్న ఫ్లెమింగ్
- కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి ఇదే మంచి సమయమని ధోనీ భావించాడన్న హెడ్ కోచ్
- ధోనీ గొప్ప న్యాయ నిర్ణేత అని ప్రశంస
కెప్టెన్‌గా చెన్నై సూపర్ కింగ్స్‌కు అద్వితీయ విజయాలు అందించిన ధోనీ ఈసారి మాత్రం సాధారణ ఆటగాడిగా మారిపోయాడు. సారథ్యం బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడు. ధోనీ తీసుకున్న ఈ నిర్ణయం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అతడెందుకీ నిర్ణయం తీసుకున్నాడన్నది ఎవరికీ అర్థంకాలేదు. సీఎస్కే హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ ధోనీ ఎందుకిలాంటి నిర్ణయం తీసుకున్నాడో వివరించాడు.
కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనేది ధోనీ నిర్ణయమేనని, చాలా రకాలుగా పరిశీలించిన తర్వాత జట్టు భవిష్యత్తు కోసమే అతడీ నిర్ణయం తీసుకున్నాడని తెలిపారు. కెప్టెన్సీని వదులుకోవడానికి ఇదే మంచి సమయమని, రుతురాజ్ వంటి ఆటగాళ్లు కెప్టెన్సీ దిశగా ఎదిగే క్రమంలో ఉన్నారని స్టీఫెన్ పేర్కొన్నాడు. కాబట్టి సారథ్య బాధ్యతలు వదులుకోవడానికి ఇదే మంచి సమయమని భావించి ధోనీ ఈ నిర్ణయం తీసుకున్నాడని వివరించాడు. సమయం ఆసన్నమైందని భావించాడని, ధోనీ గొప్ప న్యాయ నిర్ణేత అని ప్రశంసించాడు.
2022 సీజన్‌లో సీఎస్కే కెప్టెన్‌గా రవీంద్ర జడేజాను ప్రకటించాలనే నిర్ణయంపైనా ఫ్లెమింగ్ మాట్లాడాడు. నిజానికి ధోనీ కెప్టెన్సీ నుంచి వైదొలగడం ఫ్రాంచైజీకి ఇష్టం లేదన్నాడు. అయితే, ధోనీ తీసుకున్న ఈ నిర్ణయం జట్టును మార్పు దిశగా పయనించేలా చేసిందని పేర్కొన్నాడు. ధోనీ పక్కన పెట్టడానికి అప్పుడు తాము సిద్ధంగా లేమని చెప్పుకొచ్చాడు. రుతురాజ్ గైక్వాడ్ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాడని, అతడికి సాయం చేసేందుకు సీనియర్లు కూడా సిద్ధంగా ఉన్నారని ఫ్లెమింగ్ వివరించాడు.