Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి భారీగా పట్టుబడ్డ డ్రగ్స్
- నగర శివారులోని ఐడీఏ బొల్లారంలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
- ఇంటర్ పోల్ సాయంతో బొల్లారంలో స్టేట్ డ్రగ్ కంట్రోల్ అధికారుల సోదాలు
- తనిఖీల్లో పట్టుబడ్డ 90 కిలోల మెపిడ్రిన్‌ను సీజ్ చేసిన అధికారులు
- సిగరెట్ ప్యాకెట్ల మాటున విదేశాలకు డ్రగ్స్ తరలిస్తున్నట్లు గుర్తింపు
హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇంటర్ పోల్ సాయంతో నగర శివారులోని ఐడీఏ బొల్లారంలో డ్రగ్ కంట్రోల్ అధికారులు మాదకద్రవ్యాల ముఠా గుట్టురట్టు చేశారు. ఇంటర్ పోల్ సమాచారంతో స్టేట్ డ్రగ్ కంట్రోల్ అధికారులు శుక్రవారం బొల్లారంలో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా బొల్లారంలోని ఓ కంపెనీలో 90 కిలోల మెపిడ్రిన్‌ను అధికారులు సీజ్ చేశారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న డ్రగ్ విలువ మార్కెట్‌లో దాదాపు రూ.9 కోట్ల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు.
బొల్లారం పరిధిలో కస్తూరిరెడ్డి పదేళ్లుగా డ్రగ్స్ దందా చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. సిగరెట్ ప్యాకెట్ల మాటున విదేశాలకు డ్రగ్స్ తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్‌లోనూ మాదకద్రవ్యాలను సరఫరా చేసినట్లు అనుమానిస్తున్నారు. డ్రగ్ కంట్రోల్ అధికారుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.