Vizag Drugs: విశాఖ డ్రగ్స్ వ్యవహారం... పురందేశ్వరి కొడుకు, వియ్యంకుడికి ఆ కంపెనీతో సంబంధాలున్నాయి: సజ్జల

Sajjala made allegations on Purandeswari relatives
  • విశాఖలో 25 వేల కిలోల డ్రగ్స్ సీజ్
  • రాజకీయ రంగు పులుముకున్న డ్రగ్స్ వ్యవహారం
  • దీని వెనుక అధికార పక్షం ఉన్నట్టు అనుమానంగా ఉందన్న చంద్రబాబు
  • చంద్రబాబు బంధువులే దీని వెనుక ఉన్నారన్న సజ్జల 
విశాఖలో సీబీఐ సీజ్ చేసిన 25 వేల కిలోల డ్రగ్స్ కంటైనర్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ఈ అంశం టీడీపీ, వైసీపీ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధానికి కారణమైంది. 

విశాఖ పోర్టులో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టివేత విస్మయం కలిగిస్తోందని, ఈ విషయంలో రాష్ట్ర పోలీసులు, పోర్టు సిబ్బంది సహకరించకపోవడంతో చూస్తుంటే దీని వెనుక అధికార పక్షం ఉన్నట్టుగా కనిపిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల కోసం వైసీపీ హైకమాండ్ డ్రగ్స్ తెప్పించనట్టుగా ఉందని ఆరోపించారు. 

అయితే, చంద్రబాబు వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. చంద్రబాబుకు మతి ఉండే మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు కావాలనే వైసీపీపై ఆరోపణలు చేస్తున్నారని... డ్రగ్స్ వ్యవహారం వెనుక టీడీపీ, బీజేపీ నేతలు ఉన్నారన్న సందేహం కలుగుతోందని అన్నారు. 

పురందేశ్వరి బంధువులకు ఆ కంపెనీతో సంబంధాలు ఉన్నాయని, పురందేశ్వరి కొడుకు ఆ కంపెనీలో భాగస్వామిగా ఉన్నారని వెల్లడించారు. పురందేశ్వరి వియ్యంకుడు కూడా అదే కంపెనీలో భాగస్వామి అని తెలిపారు. వారు ప్రమోట్ చేసిన కంపెనీ నుంచి ఆ తర్వాత విడిపోయారని సజ్జల వివరించారు. టీడీపీ నేతలు అరిచే అరుపులు వింటుంటే, ఈ వ్యవహారం వెనుక ఉన్నది వీళ్లేనేమో అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. 

టీడీపీ నేతలు తమపై ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నారని సజ్జల స్పష్టం చేశారు. ఎప్పుడో బ్రెజిల్ అధ్యక్షుడు గెలిస్తే విజయసాయిరెడ్డి ట్వీట్ చేశాడని, దాన్ని పట్టుకువచ్చి ఈ డ్రగ్స్ వ్యవహారానికి అంటగడుడుతున్నారని మండిపడ్డారు. థర్డ్ గ్రేడ్ కంటే హీనమైన వ్యక్తి నారా లోకేశ్ అని, బజారు స్థాయికి దిగజారిన వ్యక్తి చంద్రబాబు అని ఘాటు విమర్శలు చేశారు.
Vizag Drugs
Sajjala Ramakrishna Reddy
Daggubati Purandeswari
Chandrababu
YSRCP
TDP
BJP

More Telugu News