Arvind Kejriwal: మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తిని మీరు అహంకారంతో అరెస్ట్ చేశారు: ప్రధాని మోదీపై కేజ్రీవాల్ అర్ధాంగి తీవ్ర వ్యాఖ్యలు
- లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ అరెస్ట్
- ప్రధాని మోదీ ప్రతి ఒక్కరినీ అణచివేయాలని చూస్తున్నారన్న సునీతా కేజ్రీవాల్
- ఢిల్లీ ప్రజలకు ద్రోహం తలపెట్టారని వ్యాఖ్యలు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారులు గతరాత్రి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు. దీనిపై కేజ్రీవాల్ అర్ధాంగి సునీతా కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. ఆమె ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ గారూ... మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తిని మీరు అధికార అహంకారంతో అరెస్ట్ చేశారు అని మండిపడ్డారు.
"మోదీ ప్రతి ఒక్కరినీ అణచివేయాలని చూస్తున్నారు. సీఎం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం ద్వారా ఢిల్లీ ప్రజలకు ద్రోహం తలపెట్టారు. ఢిల్లీ ప్రజలారా... మీ ముఖ్యమంత్రి ఎప్పుడూ మీ పక్షానే ఉంటారు. ఆయన బయట ఉన్నా, జైల్లో ఉన్నా ఆయన జీవితం ఎప్పుడూ దేశానికే అంకితం. ఆయన జనార్దనుడు (విష్ణువు, పరోపకారి) అని ప్రజలందరికీ తెలుసు" అని అని స్పష్టం చేశారు.