Indra Nooyi: అమెరికాలో పెరుగుతున్న భారతీయ విద్యార్థుల మరణాలు... ఇంద్రానూయి కీలక సూచనలు

Indra Nooyi advisory for Indian students residing in US

  • ఇటీవల అమెరికాలో పలువురు భారతీయ విద్యార్థుల మృత్యువాత
  • వీడియో విడుదల చేసిన ఇంద్రానూయి
  • అమెరికాలో ఎలా ఉండాలో చెప్పిన పెప్సీకో మాజీ సీఈవో

  ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే భారతీయ విద్యార్థులకు అగ్రరాజ్యం అమెరికా ప్రథమ ప్రాధాన్యతా దేశంగా ఉంది. అయితే, ఇటీవల అమెరికాలో భారతీయ విద్యార్థులు, భారత సంతతికి చెందిన విద్యార్థులు మృత్యువాత పడుతున్న ఘటనలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో, పెప్సీకో సంస్థ మాజీ సీఈవో ఇంద్రానూయి కీలక సూచనలు చేశారు. భారతీయ విద్యార్థులు అమెరికాలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. విపత్కర సంఘటనలకు దారితీసే అవాంఛనీయ అంశాలకు దూరంగా ఉండాలని సూచించారు.

ఇంద్రానూయి ఏమన్నారంటే...

  • అమెరికాలో కొత్తగా అడుగుపెట్టిన విద్యార్థులు స్నేహితులు, కొత్త అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి
  • స్థానిక చట్టాలను గౌరవించాలి
  • రాత్రివేళల్లో చీకటి ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లొద్దు
  • డ్రగ్స్ కు దూరంగా ఉండండి... మద్యం అతిగా సేవించవద్దు
  • భారతీయ విద్యార్థుల్లో కొందరు ఫెంటానెల్ వంటి మాదకద్రవ్యాలకు బానిసలవుతున్న ఘటనలు తెరపైకి వస్తున్నాయి
  • అటువంటి డ్రగ్స్ ప్రాణాంతకమైనవి... శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి... తద్వారా కెరీర్ అవకాశాలను దెబ్బతీస్తాయి
  • భారతీయ విద్యార్థులు తమ వీసా స్టేటస్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండాలి
  • పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసే భారతీయ విద్యార్థులు తాము చేస్తున్న ఉద్యోగం చట్టబద్ధమైనదేనా, కాదా అనేది నిర్ధారించుకోవాలి
  • తాము విద్యాభ్యాసం చేస్తున్న సంస్థ పట్ల అవగాహన కలిగి ఉండాలి
  • సోషల్ మీడియాతోనూ, స్కాంలతోనూ జాగ్రత్తగా ఉండాలి... అని ఇంద్రానూయి సూచించారు.

ఇంద్రానూయి వీడియోను న్యూయార్క్ లోని భారత ఎంబసీ అధికారులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.


  • Loading...

More Telugu News