New Delhi: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు 6 రోజుల పాటు ఈడీ కస్టడీ విధించిన కోర్టు
- ఈ నెల 28వ తేదీ వరకు కేజ్రీవాల్‌ను విచారించనున్న ఈడీ
- కేజ్రీవాల్‌ను పది రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరిన ఈడీ
- ఇరువైపుల వాదనల అనంతరం ఆరు రోజుల కస్టడీకి ఇచ్చిన కోర్టు
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను రౌస్ అవెన్యూ కోర్టు 6 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. ఈ నెల 28వ తేదీ వరకు కేజ్రీవాల్‌ను ఈడీ విచారించనుంది. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ ఆయనను నిన్న సాయంత్రం రెండు గంటల పాటు విచారించింది. అనంతరం రాత్రి అరెస్ట్ చేసింది. ఈడీ ఆయనను పది రోజుల పాటు కస్టడీకి అడిగింది. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం ఆరు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది.
అరవింద్ కేజ్రీవాల్ తరఫు న్యాయవాది మదన్ లాల్ మాట్లాడుతూ... కేజ్రీవాల్‌ను ఈడీ పది రోజుల కస్టడీకి అడిగిందని, అన్ని కోణాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఆరు రోజుల కస్టోడియల్ రిమాండ్‌కు ఇచ్చిందన్నారు.
ఢిల్లీ మంత్రి అతిషి మాట్లాడుతూ... ఈడీ అండతో ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయాలనుకుంటోందని మండిపడ్డారు. మద్యం కేసుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై ఈడీ ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలను గుర్తించలేదన్నారు. ఈ రోజు దేశ చరిత్రలోనే చీకటి రోజు అని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం హత్య జరిగిందని... దీనిని దేశ ప్రజలంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు.