TDP: ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనాను కలిసిన టీడీపీ అగ్రనేతలు
- ప్రభుత్వ అధికారులు వైసీపీకి తొత్తులుగా పనిచేస్తున్నారని ఫిర్యాదు
- తప్పుడు అధికారులపై చర్యలు తీసుకోవాలని వినతి
- మీడియాతో మాట్లాడిన వర్ల రామయ్య, బోండా ఉమ
కొందరు ప్రభుత్వ అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారంటూ టీడీపీ నేతలు ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బోండా ఉమామహేశ్వరరావు నేడు ముఖేశ్ కుమార్ మీనాను అమరావతి సచివాలయంలో కలిశారు.
ఎన్నికల అఫిడవిట్‌లో అభ్యర్ధులపై ఉన్న కేసు వివరాలు జత చేయాల్సి ఉండగా, దీనిపై రాష్ట్ర డీజీపీకి లేఖ రాస్తే, ఆ విషయం ఎస్పీని అడగాలని నిర్లక్ష్యపూరితంగా సమాధానం చెప్పారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీలకు లేఖలు రాసినా కేసు వివరాలు వారు తెలియపరచడం లేదని ఎన్నికల ప్రధాన అధికారికి వివరించారు.
అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నేతలు పాల్గొన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చిన తర్వాత అవినీతి, అధికార దుర్వినియోగం, దోపిడీలు తగ్గాల్సింది పోయి అందుకు భిన్నంగా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని వర్ల రామయ్య పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అయితే మాకేంటి, మమ్మల్ని ఎవరు ఆపగలరు, నిరోధించగలరనే రీతిలో జగన్ రెడ్డి ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. ఖనిజ సంపదను వైసీపీ ప్రభుత్వం దోచుకుంటూ ఎన్నికల్లో ఆ డబ్బును వాడుకోవాలని చూస్తుందని వర్ల రామయ్య దుయ్యబట్టారు.
"అక్రమ ఇసుక రవాణాను చిత్రీకరించి సీఈవో ముఖేశ్ కుమార్ మీనాకు చూపించి ఫిర్యాదు చేశాం. జిల్లా కలెక్టర్, ఎస్పీల వద్ద నుంచి రిపోర్ట్ తీసుకొని తగు చర్యలు తీసుకుంటామని సీఈవో హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్ పేరుతో తప్పించుకుంటున్న మైనింగ్ ఏడీ, స్థానిక ఎస్సై ఇద్దరిని వెంటనే సస్పెండ్ చేయాలని అని కలెక్టర్, ఎస్పీకి విజ్ఞప్తి చేస్తున్నాం” అని అన్నారు.
కొంతమంది ఐపీఎస్ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని బోండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. డబ్బు, మద్యం సరఫరా చేస్తున్న విశ్వంత్ రెడ్డి, తప్పుడు కేసులతో తెలుగుదేశం, జనసేన నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్న కొల్లు రఘురాంరెడ్డి, జగన్ రెడ్డి ఆదేశాలనుసారం ప్రతిపక్షాల ఫోన్‌లు ట్యాపింగ్ చేస్తున్న ముగ్గురు అడిషనల్ ఎస్పీ క్యాడర్ అధికారులపై ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు.
వీళ్ళందరిపై ఉన్నత స్థాయి విచారణ చేసి నిజానిజాలు బయట పెట్టాలని, అప్పటివరకు వారిని విధుల నుంచి తప్పించాలని సీఈఓని కోరినట్లు బోండా ఉమా తెలియజేశారు.