Andhra Pradesh: ఎపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో మాజీ సీఎంల కుమారులు, కుమార్తెలు
- పులివెందుల అసెంబ్లీ స్థానంలో బరిలోకి దిగిన సీఎం జగన్
- మంగళగిరి నుంచి నారా లోకేశ్, హిందూపురం నుంచి బాలకృష్ణ
- తెనాలి అసెంబ్లీ బరిలో నాదెండ్ల మనోహర్, డోన్ నుంచి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి
- లోక్‌సభ ఎన్నికల్లో పురందేశ్వరి, వైఎస్ షర్మిల కూడా లోక్‌సభ స్థానానికి పోటీ చేసే ఛాన్స్
- వెంకటగిరి స్థానం నుంచి బరిలో నిలిచిన నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి
ఏపీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఈసారి ఏకంగా మాజీ సీఎంల వారసులు ఎనిమిది మంది బరిలో నిలవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ పులివెందుల నుంచి బరిలో నిలిచారు. గత రెండు ఎన్నికల్లో ఆయన ఇదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
మాజీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ మంగళగిరి నుంచి బరిలో ఉన్నారు. గత ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పనిచేశారు.
టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు కుమారుడు, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ మరోసారి హిందూపురం ఎమ్మెల్యే సీటు నుంచి బరిలో నిలిచారు. గత రెండు పర్యాయాలు ఆయన ఇదే స్థానం నుంచి విజయం సాధించారు.
మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కుమారుడు, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి బరిలో నిలిచారు. గతంలో ఆయన రెండు సార్లు తెనాలికి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు.
మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి కుమారుడు కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి కూడా ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. టీడీపీ తరపున డోన్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిచారు. గతంలో మూడు సార్లు ఎంపీగా ఉన్న జయసూర్యప్రకాశ్‌రెడ్డి కేంద్ర మంత్రిగానూ పనిచేశారు.
ఇక మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడు నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి వైసీపీ తరపున వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు.
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి ఈసారి లోక్‌సభ ఎన్నిక బరిలో పోటీకి దిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న ఆమె గతంలో బాపట్ల, విశాఖ ఎంపీగా, కేంద్రమంత్రిగా పనిచేశారు. దివంగత రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమె లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది.