TDP: ఇంకా ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించని టీడీపీ

TDP Ticket Allocation Pending for more Six assembly constituencies
  • అభ్యర్థుల ఎంపికపై వీడని సస్పెన్స్
  • భీమిలి టికెట్ కోసం మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పట్టు
  • చీపురుపల్లి నుంచి పోటీ చేయాలంటున్న అధిష్ఠానం
ఆంధ్రప్రదేశ్ లో మరో ఆరు అసెంబ్లీ స్థానాలకు తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించలేదు. సీనియర్ నేతల డిమాండ్, ఇతర పార్టీల నుంచి నేతల చేరికల నేపథ్యంలో ఆరు చోట్ల అభ్యర్థుల ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇందులో భీమిలి, చీపురుపల్లి, దర్శి, రాజంపేట, ఆలూరు, అనంతపురం అర్బన్ నియోజకవర్గాలు ఉన్నాయి. భీమిలి టికెట్ కోసం మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పట్టుబడుతుండగా.. అధిష్ఠానం ఆయనను చీపురుపల్లి నుంచి బరిలోకి దించాలని యోచిస్తోంది. చీపురుపల్లి టికెట్ ను మాజీ మంత్రి కళా వెంకటరావు ఆశిస్తున్నారు.

పొత్తులో భాగంగా ఎచ్చెర్ల సీటును బీజేపీకి కేటాయించడంతో తాను చీపురుపల్లి నుంచి పోటీ చేస్తానని కళా వెంకటరావు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే భీమిలితో పాటు అటు చీపురుపల్లి నియోజకవర్గానికి అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదని సమాచారం. మరోవైపు, నెల్లిమర్ల స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో అక్కడ టీడీపీ ఇన్ ఛార్జ్ బంగార్రాజుకు భీమిలి టికెట్ ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం.

లోక్ సభ స్థానాల పంపకంలో బీజేపీకి ఇచ్చిన విజయనగరం సీటును వెనక్కి తీసుకుని రాజంపేట ఇవ్వాలనే ప్రతిపాదనను టీడీపీ పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదనను అమలు చేస్తే కళా వెంకటరావును విజయనగరం నుంచి లోక్ సభ బరిలో దించే అవకాశం ఉంది. ఇక ప్రకాశం జిల్లా దర్శి టికెట్ పై పలువురు నేతల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. దర్శి టికెట్ ఇస్తే టీడీపీ కండువా కప్పుకుంటానని మాజీ మంత్రి శిద్దా రాఘవరావు చెబుతున్నారు. అయితే, ఆయనపై పార్టీలోని కొన్ని వర్గాల్లో అసంతృప్తి ఉండడంతో పార్టీ పెద్దలు ఆలోచనలో పడ్డారు. ప్రస్తుతం ఆయన కోడలుకు టికెట్ ఇచ్చే విషయంపై చర్చ జరుగుతోంది.

కర్నూలు జిల్లా ఆలూరు అసెంబ్లీ స్థానానికి వీరభద్రగౌడ్‌తో పాటు వైకుంఠం మల్లికార్జున, ఆయన సోదరుడి భార్య జ్యోతి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అనంతపురం అర్బన్‌ టికెట్‌కి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరితో పాటు, మరికొన్ని పేర్లు పరిశీలిస్తున్నారు. రాజంపేట టికెట్‌ కోసం చెంగల్రాయుడు, జగన్మోహన్‌రాజు పోటీ పడుతున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు టికెట్ ఇచ్చే హామీతో వైసీపీ నేత గుమ్మనూరు జయరాం తన మంత్రి పదవికి రాజీనామా చేసి మరీ టీడీపీలో చేరారు. అయితే, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్, మరో సీనియర్ నేత పేరును టికెట్ కోసం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
TDP
Assembly Polls
Andhra Pradesh
Seat Allocation
Bheemili
Cheepurupalli
Aluru
darshi

More Telugu News