Gujarat: గుజరాత్‌లో బీజేపీకి బిగ్ షాక్.. ఎన్నికల బరి నుంచి తప్పుకున్న ఎంపీ అభ్యర్థులు
- వడోదర లోక్‌సభ అభ్యర్థి రంజన్ భట్ ఎన్నికల్లో పోటీకి విముఖత
- ఆమె అభ్యర్థిత్వాన్ని సొంత బీజేపీ నేతలే తీవ్రంగా వ్యతిరేకించడంతోనే ఈ నిర్ణయం
- ఎన్నికల బరి నుంచి తప్పుకున్న సబర్‌కాంత లోక్‌సభ ఎంపీ అభ్యర్థి భిఖాజీ ఠాకూర్
- వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్లు వెల్లడి
గుజరాత్‌లో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రకటించిన ఇద్దరు అభ్యర్థులు పోటీకి విముఖత వ్యక్తం చేశారు. గుజరాత్‌లోని వడోదర సెగ్మెంట్ నుంచి సిట్టింగ్ ఎంపీ రంజన్ భట్‌ను బరిలోకి దింపగా.. తాజాగా ఆమె పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని రంజన్ భట్ ఎక్స్ (గతంలో ట్విటర్) ద్వారా వెల్లడించారు. ఆమె అభ్యర్థిత్వాన్ని బీజేపీలోని పలువురు తీవ్రంగా వ్యతిరేకించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
వడోదర లోక్‌సభ స్థానం నుంచి ఆమెను మళ్లీ నిలబెట్టాలనే బీజేపీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. నగరంలోని పలు ప్రదేశాలలో బ్యానర్లు కూడా ప్రదర్శించారట. 2014లో జరిగిన ఉప ఎన్నికలో ప్రధాని మోదీ ఆ స్థానం నుంచి తప్పుకోవడంతో భట్ పోటీ చేసి గెలిచారు. అనంతరం ఇదే స్థానం నుంచి 2019లోనూ బరిలోకి దిగి విజయం సాధించారు.
అలాగే సబర్‌కాంత లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి భిఖాజీ ఠాకూర్ కూడా ఎన్నికల్లో పోటీ చేయడం లేదని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఠాకూర్‌పై కూడా స్థానిక నేతల అసంతృప్తినే కారణం. అయితే, ఈ పరిణామాలను చక్కదిద్దేందుకు బీజేపీ అధిష్ఠానం రాష్ట్ర నాయకత్వానికి మార్గనిర్దేశకం చేసినట్లు సమాచారం. కాగా, గుజరాత్‌లోని 26 లోక్‌సభ స్థానాలకు మే 7వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.