IPL-2024: సిక్స్ తో పంజాబ్ ను గెలిపించిన లివింగ్ స్టన్... ఉత్కంఠ పోరులో ఢిల్లీ ఓటమి
- ఛండీగఢ్ లో మ్యాచ్
- మొదట 20 ఓవర్లలో 174 పరుగులు చేసిన ఢిల్లీ
- 19.2 ఓవర్లలో ఛేదించిన పంజాబ్ కింగ్స్
ఐపీఎల్ లో ఇవాళ పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ కు ఉత్కంఠభరిత ముగింపు లభించింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 175 పరుగుల విజయలక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 19.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఛేదించింది.
ఆఖరి ఓవర్లో విజయానికి 6 పరుగులు అవసరంగా కాగా, లియామ్ లివింగ్ స్టన్ ఓ భారీ సిక్స్ తో పంజాబ్ విజయాన్ని ఖాయం చేశాడు. లివింగ్ స్టన్ 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 38 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
అంతకుముందు, పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ లో శామ్ కరన్ అర్ధసెంచరీతో రాణించాడు. శామ్ కరన్ 47 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సుతో 63 పరుగులు చేశాడు. అయితే, ఇన్నింగ్స్ 19వ ఓవర్ బౌలింగ్ చేసిన ఢిల్లీ పేసర్ ఖలీల్ అహ్మద్ వరుస బంతుల్లో శామ్ కరన్, శశాంక్ సింగ్ (0)లను అవుట్ చేయడంతో మ్యాచ్ లో ఉత్కంఠ నెలకొంది. అయితే, హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్ మన్ లివింగ్ స్టన్ క్రీజులో ఉండడం పంజాబ్ విజయానికి ఢోకా లేకుండా పోయింది.
పంజాబ్ కింగ్స్ ఛేజింగ్ లో కెప్టెన్ శిఖర్ ధావన్ 22, ప్రభ్ సిమ్రన్ సింగ్ 26 పరుగులు చేశారు. ఓపెనర్ గా వచ్చిన జానీ బెయిర్ స్టో (9) నిరాశపరిచాడు. టీమిండియా ఆటగాడు, వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. జితేశ్ 9 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 2, కుల్దీప్ యాదవ్ 2, ఇషాంత్ శర్మ 1 వికెట్ తీశారు.