ISIS: ఐసిస్‌లో చేరేందుకు వెళ్తూ పట్టుబడ్డ ఐఐటీ గువహాటి విద్యార్థి

IIT Guwahati student on way to join ISIS held in Assam says Police
  • ఈ-మెయిల్ ఆధారంగా గుర్తించిన అసోం పోలీసులు
  • ఐసిస్‌లో చేరేందుకు వెళ్తున్నట్టు పేర్కొన్న విద్యార్థి
  • చట్టప్రకారం తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొన్న పోలీసులు
తీవ్రవాద భావజాలంతో నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు వెళ్తున్నాడనే ఆరోపణలపై ఐఐటీ గువహాటి విద్యార్థిని అసోం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలోని కమ్రూప్ జిల్లాలోని హజో పట్టణానికి సమీపంలో శనివారం రాత్రి అతడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు ప్రకటించారు. ఈ విషయాన్ని అసోం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జీపీ సింగ్ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. ఐఐటీ గువహాటి విద్యార్థి ఐసిస్‌‌ పట్ల విధేయత చూపిస్తున్నట్టుగా చెబుతున్నాడని, అతడిని అదుపులోకి తీసుకున్నామని వివరించారు. అరెస్టయిన విద్యార్థిపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ ఘటనపై అడిషనల్ ఎస్పీ(ఎస్‌టీఎఫ్) కల్యాణ్ కుమార్ పాఠక్ మాట్లాడుతూ.. తమకు వచ్చిన ఒక ఈ-మెయిల్‌లోని సందేశాన్ని నిర్ధారించామని చెప్పారు. ఈ-మెయిల్‌లోని సందేశాన్ని ధ్రువీకరించిన అనంతరం దర్యాప్తు ప్రారంభించామని వెల్లడించారు. ఈ-మెయిల్‌ను విద్యార్థే పంపించాడని, ఐసిస్‌లో చేరడానికి వెళ్తున్నట్టుగా అందులో పేర్కొన్నాడని వివరించారు. విద్యార్థి అరెస్ట్ విషయాన్ని ఐఐటీ గువహాటి అధికారులకు తక్షణమే తెలియజేశామని వివరించారు. విద్యార్థి తప్పిపోయాడని, అతడి ఫోన్ స్విచ్ఛాప్ వస్తోందని యూనివర్సిటీ అధికారులు తెలిపారని చెప్పారు. ఇక అరెస్టయిన విద్యార్థి ఢిల్లీలోని ఓఖ్లా ప్రాంతానికి చెందినవాడని, గువహాటి యూనివర్సిటీలో 4వ సంవత్సరం విద్యార్థి అని కల్యాణ్ కుమార్ పాఠక్ వివరించారు. 

విద్యార్థి ఐసిస్‌లో చేరబోతున్నాడని నిర్ధారణ అయిన తర్వాత సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని, స్థానికుల సహాయంతో గౌహతికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న హజో ప్రాంతంలో విద్యార్థిని గుర్తించినట్టు అసోం పోలీసులు వివరించారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం అతడిని ఎస్‌టీఎఫ్ కార్యాలయానికి తీసుకెళ్లామని, ఈ-మెయిల్ ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించామని అన్నారు. ఇక యూనివర్సిటీలోని విద్యార్థి రూమ్‌లో ఐసిస్ జెండాతో పోలిన నల్ల జెండాను గుర్తించామని, ఈ జెండాను నిర్ధారించేందుకు నిషేధిత దుస్తులను ధ్రువీకరించే ప్రత్యేక సంస్థలకు పంపించామని చెప్పారు.
ISIS
IIT Guwahati
Assam
Student arrest

More Telugu News