Kangana Ranaut: ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తన పేరు ప్రకటించాక తొలిసారి స్పందించిన నటి కంగనా రనౌత్‌

Kangana Ranaut first reaction after BJP fields her from Mandi seat
  • బీజేపీకి ఎల్లప్పుడూ బేషరతు మద్దతు ఉంటుందన్న బాలీవుడ్ నటి
  • హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి పోటీ చేస్తానని వెల్లడి
  • అధికారికంగా బీజేపీలో చేరడం సంతోషంగా ఉందన్న కంగన  
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఆమె స్వరాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ సీటును కంగనాకు కేటాయిస్తూ బీజేపీ ఆదివారం రాత్రి ప్రకటన వెలువరించింది. దీంతో అధికారికంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్న కంగనా.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. 

‘‘నా ప్రియమైన భారతదేశం, ఈ దేశ ప్రజల సొంత పార్టీ అయిన బీజేపీకి ఎల్లప్పుడూ నా బేషరతు మద్దతు వుంటుంది. నా సొంత రాష్ట్రమైన హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ అధిష్ఠానం నా పేరుని ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ విషయంలో హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. అధికారికంగా బీజేపీలో చేరడం గౌరవంగా భావిస్తున్నాను. సంతోషంతో ఉప్పొంగిపోతున్నాను. నిజమైన బీజేపీ కార్యకర్తగా, విశ్వసనీయత కలిగిన ప్రజా సేవకురాలిగా రాణించేందుకు ఎదురుచూస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు’’ అని ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు.

కాగా బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నేటి తరం హీరోయిన్లలో కంగానా రనౌత్ ఒకరిగా ఉన్నారు. గ్యాంగ్‌స్టర్, వో లమ్హే, ‘లైఫ్ ఇన్ ఎ...మెట్రో’, ఫ్యాషన్, రాజ్: ది మిస్టరీ కంటిన్యూస్, తను వెడ్స్ మను, క్వీన్, రివాల్వర్ రాణీ, మణికర్ణిక వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం ఆమె ‘ఎమర్జెన్సీ’ సినిమాలో నటిస్తున్నారు. కంగనాకు సీటు దక్కడంపై ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.
Kangana Ranaut
BJP
Lok Sabha Polls
Mandi seat
BJP candidates list

More Telugu News