Andhra Pradesh: ఏపీలో పెరుగుతున్న పొలిటికల్ హీట్.. ఒకేసారి చంద్రబాబు, జగన్ ప్రచారం ప్రారంభం
- మార్చి 27న రాయలసీమలోని సొంత నియోజకవర్గాల నుంచి జగన్, చంద్రబాబు ప్రచారం ప్రారంభం
- మేమంతా సిద్ధం పేరుతో ఉత్తరాంధ్ర వరకూ జగన్ బస్సు యాత్ర
- నియోజకవర్గాల వారీగా చంద్రబాబు ప్రచారం
- రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో చంద్రబాబు సభలు, సమావేశాలు
ఏపీలో పొలిటికల్ హీట్ రానురాను పెరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒకే రోజు తమ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. మార్చి 27న ఇందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఇద్దరు నేతలూ రాయలసీమలోని తమ సొంత నియోజకవర్గాల నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు.
ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల ఎంపికను దాదాపుగా పూర్తి చేశాయి. దీంతో, ప్రధాన పార్టీల ఫోకస్ ప్రచారం వైపు మళ్లింది. ఎల్లుండి నుంచి సీఎం జగన్, చంద్రబాబు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఇద్దరు ప్రధాన నేతలు ఒకేసారి ప్రచారం మొదలుపెట్టనుండటం రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచేసింది.
జగన్ షెడ్యూల్ ఇదీ..
ఇప్పటికే సిద్ధం యాత్ర పేరిట ప్రజల్లో ఉన్న సీఎం జగన్ ఎల్లుండి నుంచీ మేమంతా సిద్ధం పేరిట ప్రచారం నిర్వహిస్తారు. కడప జిల్లా ఇడుపుల పాయలో ప్రారంభమయ్యే జగన్ యాత్ర ఉత్తరాంధ్ర వరకూ కొనసాగుతుంది. 27న ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద జగన్ నివాళులు అర్పించి ప్రచారం ప్రారంభిస్తారు. ఆ రోజు సాయంత్రం ప్రొద్దుటూరులో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. 28వ తేదీన నంద్యాల లేదా ఆళ్లగడ్డలో ప్రజలతో ముఖాముఖీ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం నంద్యాలలో జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 29న యాత్ర కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రవేశిస్తుంది. ఆ రోజు సాయంత్రం ఎమ్మిగనూరులో నిర్వహించే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు.
చంద్రబాబు ప్రచారం ఇలా..
మార్చి 27 నుంచి మార్చి 31 వరకూ చంద్రబాబు ప్రచారం కొనసాగనుంది. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు నిర్వహించేలా ప్రచారం షెడ్యూల్ సిద్ధమైంది. 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో బాబు ప్రచారం నిర్వహిస్తారు. 29న రాప్తాడు, శింగనమల, కదిరి.. 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు.. 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో టీడీపీ అధినేత ప్రచారం నిర్వహిస్తారు. 31వ తేదీన కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో చంద్రబాబు పర్యటిస్తారు. నేడు రేపు మాత్రం సొంత నియోజకవర్గంలో చంద్రబాబు ప్రచారం నిర్వహిస్తారు.