Naveen Jindal: బీజేపీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్

Industrialist Naveen Jindal Joins BJP Ahead Of Polls In Jolt To Congress
  • ఆదివారం కాషాయ కండువా కప్పుకున్న పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్
  • కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీ గూటికి చేరిన వైనం
  • 2004-14 మధ్య కురుక్షేత్ర (హర్యానా) లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన జిందాల్ 
  • ప్రధాని ‘వికసిత్ భారత్’ కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు కాంగ్రెస్ ను వీడుతున్నట్టు వెల్లడి
ఎన్నికల వేళ హస్తం పార్టీకి మరో షాక్ తగిలింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, జిందాల్ స్టీల్ అండ్ పవర్ చైర్మన్ నవీన్ జిందాల్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారు. ఆదివారం పార్టీ జనరల్ సెక్రెటరీ వినోద్ తావ్డే సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు బీజేపీలో చేరినట్టు నవీన్ జిందాల్ తెలిపారు. ‘‘కురుక్షేత్ర (హర్యానా) నుంచి 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నా. అప్పటి ప్రధాని డా. మన్మోహన్ సింగ్‌కు, కాంగ్రెస్ నాయకత్వానికి ధన్యవాదాలు చెబుతున్నా. ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశా’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. 

2004-14 మధ్య కురుక్షేత్ర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఆయన.. ప్రస్తుతం బీజేపీ తరుపున మళ్లీ ఇదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. 

పార్టీలో చేరిక సందర్భంగా నవీన్ జిందాల్ ప్రధానిపై ప్రశంసలు కురిపించారు. గత పదేళ్ల కాలంలో మోదీ సారథ్యంలో భారత్ అనేక రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. ఆర్టికల్ 370 రద్దు ఓ భారీ ముందడుగని ప్రశంసించారు. రామ మందిర నిర్మాణం గురించి కూడా ప్రస్తావించారు. దేశాభివృద్ధి కోసం కృషి చేస్తున్న పార్టీకి జిందాల్ చేరికతో కొత్త ఊపు వచ్చిందని పార్టీ జనరల్ సెక్రెటరీ వినోద్ తావ్డే తెలిపారు. 

మరోవైపు, జిందాల్ పార్టీ మార్పుపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. పదేళ్ల పాటు పార్టీకి ఏ రకంగానూ ఉపయోగపడని ఓ వ్యక్తి కాంగ్రెస్‌ను వీడానని ప్రకటించడం హాస్యాస్పదమని సీనియర్ నేత జైరాం రమేశ్ ట్విట్టర్ వేదికగా విమర్శలు ఎక్కుపెట్టారు.
Naveen Jindal
BJP
Haryana
Congress
Jairam Ramesh

More Telugu News